T20 World Cup 2026: డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ మరో టీ20 ప్రపంచకప్ సమరానికి రెడీ అయింది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాత్రం భారీ ఒత్తిడి నెలకొంది. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే మ్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.
గంభీర్ పదవి గండంలో ఉందా?
రాహుల్ ద్రవిడ్ తర్వాత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ హయాంలో భారత్ మిశ్రమ ఫలితాలను సాధించింది. టీ20ల్లో వరుసగా 9 సిరీస్‌లు గెలిచి అప్రహత విజయాలతో దూసుకుపోతున్నా.. టెస్టు మరియు వన్డే ఫార్మాట్లలో ఎదురైన పరాజయాలు గంభీర్ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గంభీర్ ఆధ్వర్యంలో ఆడిన 19 టెస్టుల్లో భారత్ 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ (2-0), న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ (2-1) కోల్పోవడం గంభీర్ భవిష్యత్తును డైలమాలో పడేసింది. ఈ ప్రపంచకప్‌లో భారత్ విఫలమైతే గంభీర్ తన పదవిని కోల్పోయే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
రో-కో లేని లోటును తీరుస్తున్న అభిషేక్!
2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యారు. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన యువ సంచలనం అభిషేక్ శర్మ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. 194 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్, న్యూజిలాండ్‌పై కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‌లోకి రావడం, ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ జట్టుకు కొండంత బలాన్నిస్తున్నాయి.
Also Read: Jos Buttler -జోస్ బట్లర్ సరికొత్త చరిత్ర.. ఆండర్సన్ ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు!
బలంగా పేస్ దళం
జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా వంటి కొత్త టాలెంట్ వచ్చి చేరింది. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో కూడిన పేస్ దళం ప్రత్యర్థులకు సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉంది. హార్దిక్ పాండ్యా, శివం దూబే రూపంలో ఇద్దరు నాణ్యమైన ఆల్ రౌండర్లు జట్టుకు లగ్జరీగా మారారు.
భారత్-బంగ్లా వివాదం
ఈ టోర్నీ ఆరంభానికి ముందే కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకున్నారు. దీనికి నిరసనగా పాకిస్థాన్ ప్రభుత్వం కూడా తమ జట్టును భారత్-పాక్ గ్రూప్ మ్యాచ్ కోసం కొలంబోకు వెళ్లవద్దని ఆదేశించింది. దీనివల్ల క్రికెట్ చరిత్రలో అతిపెద్ద రైవల్రీని అభిమానులు గ్రూప్ స్టేజ్‌లో మిస్ కానున్నారు.

