T20 World Cup Italy vs Nepal: టీ20 ప్రపంచ కప్ 2026లో ఇటలీ బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. ఇటలీ ఓపెనర్లు జస్టిన్ మోస్కా(60), ఆంథోనీ మోస్కా(62) హాఫ్ సెంచరీలతో జట్టుకి ఘన విజయాన్ని అందించారు.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఇటలీ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. నేపాల్ నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 12.4 ఓవర్లలోనే ఛేదించి.. గ్రూప్ స్టేజిలో తన తొలి విజయాన్ని ఇటలీ జట్టు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన నేపాల్.. 19.3 ఓవర్లలో 123 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆరిఫ్ షేక్(27) టాప్ స్కోరర్ కాగా.. ఆసిఫ్ షేక్(20), రోహిత్ పాడెల్(23) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ మంచి స్కోర్ చేయలేకపోయారు.
ఇటలీ బౌలర్లలో క్రిషన్ 3, బెన్ మానేంటి 2, అలీ హసన్, స్మట్స్, జస్‌ప్రీత్ సింగ్ తలొక వికెట్ పడగొట్టి నేపాల్ జట్టు స్కోర్‌ను 123కే పరిమితం చేశారు. అయితే గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేసి నేపాల్ జట్టు అందరి ప్రశంసలు అందుకుంది. కానీ ఇటలీపై మాత్రం ఆ దూకుడు కొనసాగించలేకపోయింది. గ్రూప్ స్టేజిలో ఇప్పటికే 2 మ్యాచ్‌లు ఆడేసిన నేపాల్.. ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో సెమీస్‌కు చేరుకోవడానికి అవకాశాలు లేనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

