పీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలో పట్టణ, మండల స్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంస పత్రాల ప్రదానోత్సవం కార్యక్రమం జనసంద్రలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనయుడు పట్నం రినీష్ రెడ్డికి విలీయమూన్ చౌరస్తా నుండి తాండూరు పట్టణ రహదారుల మీదుగా బైక్ ర్యాలీ ద్వారా వేలమంది యువకులతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథిలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మనీషా మనిదీప్ రెడ్డి హాజరై గెలుపొందిన పెద్దేముల్ కు మొదటి విజేతగా జట్టుకు రూ. 2 లక్షలు, బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ తండా రన్నర్ జట్టుకు రూ. 1 లక్ష, మండల స్థాయి, పట్టణ స్థాయిలోని విజేత జట్లకు రూ. 50 వేలు, రన్నర్ జట్టుకు రూ.25 వేలు నగదు బహుమతి, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. క్రీడలతో శరీరం దృఢంగా అవుతుందని తెలిపారు.
క్రీడాకారులకు సహాయ సహకారం అందించడానికి ముందుంటామని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం రినీష్ రెడ్డి మాట్లాడుతూ… ఆటలో గెలుపు ఓటములను సమానంగా భావించి క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. అదేవిధంగా యువత అందరూ ప్రోత్సహిస్తే ముందు ముందు ఇంతకు రెట్టింపు కార్యక్రమాలు చేపడుతాను, రాబోవు రోజుల్లో వైద్య విద్య అనేక కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తాండూర్ యువత మత్తు పదార్థాలకు చెడు అలవాట్లకు బానిసలు అయ్యి వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉండటం చాలా బాధాకరంగా ఉంది. మత్తు పదార్థాలకు మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు అని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ సప్న పరిమల్, పిఏసీఎస్ చైర్మన్ రవి గౌడ్, కౌన్సిలర్లు శోభారాణి, రవి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం, అబ్దుల్ రావూఫ్, డాక్టర్ సంపత్, అజయ్ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, పలు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.