ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో దీనిపై ఓ క్లారిటీ రానుంది. జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే.. దీంతో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో మూడో వన్డేలో ఆడే టీమిండియాకు బుమ్రాను ఎంపిక చేశారు. అయితే ఆ మ్యాచ్ లో అతడు ఆడేది అనుమానంగా మారింది. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్నాడు.
తాజాగా అతడికి స్కానింగ్ సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత బుమ్రా గాయానికి జనవరిలో ఒక స్కానింగ్ తీశారు. తాజాగా మరో స్కానింగ్ తీశారు. ఆ నివేదికలు వస్తే బుమ్రా భవితవ్యం తేలనుంది. బుమ్రా మెడికల్ రిపోర్ట్స్ ను న్యూజిలాండ్ కు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ రోవన్ స్కౌటెన్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
టీమ్ఇండియాకు ఎంతో కీలకమైన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే జట్టుకు సమస్యలు తప్పవు. ఏ వేదికలో ఆడినా తన అద్భుత బౌలింగ్ తో బుమ్రా సత్తాచాటుతున్నాడు. గతేడాది జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ లోనూ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో, బుమ్రా వైద్య పరీక్షల నివేదికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.