ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ కు చేరుకుంది. గ్రూప్ A లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన పోరులో భారత్ 44 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దాంతో గ్రూప్ ఎ విన్నర్ హోదాలో భారత్ సెమీస్‌లోకి అడుగు పెట్టింది. 250 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు హార్దిక్ పాండ్యా ఆరంభంలోనే ఎదురుదెబ్బ కొట్టాడు. ఓపెనర్ రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. ఆ తర్వాత విల్ యంగ్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు. దాదాపు అతనొక్కడే 20 ఓవర్లు బ్యాటింగ్ చేశాడు. 120 బంతుల్లో 7 ఫోర్లతో 81 పరుగులు చేసి 7వ వికెట్‌గా వెనుదిరిగాడు.
విలియమ్సన్ తప్పితే మిగతా బ్యాటర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12, మిచెల్ బ్రేస్‌వెల్ 2 పరుగులు చేసి విఫలం అయ్యారు. చివర్లో కెప్టెన్ సాంట్నర్ కొద్ది సేపు మెరుపులు మెరిపించినా.. అప్పటికే రిక్వైర్డ్ రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. 31 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో 28 పరుగులు చేసిన సాంట్నర్‌ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ కు 2 వికెట్లు లభించాయి.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డర్లు మెరుపు క్యాచ్ లు పట్టడంతో టీమిండియా భారీ స్కోరు సాధించలేకపోయింది. గిల్ 2, రోహిత్ 15, కోహ్లీ 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇక పవర్ ప్లేలో అతి తక్కువ స్కోర్ చేసింది. దీంతో 33 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ జోడి తొలుత క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. కుదురుకున్నాక శ్రేయస్ మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు అక్షర్ అతడికి చక్కని సహకారం అందించాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని అక్షర్‌ను ఔట్ చేయడం ద్వారా రచిన్ రవీంద్ర విడగొట్టాడు. అయ్యర్-అక్షర్ జోడి నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
ఇక అక్షర్ ఔటైన తరువాత రాహుల్‌తో కలిసి అయ్యర్ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. శతకానికి చేరువైన అతడిని విలియం ఒరూర్కే బోల్తా కొట్టించాడు. ఈ ఇన్నింగ్స్ లో శ్రేయస్ అయ్యర్ (79) పరుగులు చేయగా, హార్దిక్ (45), అక్షర్ పటేల్ (42) పరుగులతో రాణించారు. మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆడలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీశాడు. కైల్ జామీసన్, విలియం ఒరూర్కే, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర లు తలా ఓ వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా మంగళవారం తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్ట నుంది. ఆస్ట్రేలియాను సెమీస్‌లోనే ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.