Vaibhav Suryavanshi: సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో అతిపిన్న వయస్సులో అడుగుపెట్టినవాడు వైభవ్ సూర్యవంశీ. 14ఏళ్ల కుర్రాడు సెన్సేషన్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. తాను ఆడిన ప్రతి మ్యాచులోనూ తనదైన స్టైల్‌లో ఆడుతూ టీమ్ ఇండియాకు ఓ స్టార్ క్రికెటర్ లాగా మారిపోతున్నాడు.
బిహార్‌కు చెందిన ఈ వైభవ్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నా కూడా టీమ్ ఇండియా అండర్-19 జట్టుకూ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడు ఆడిన చివరి మ్యాచ్ కేవలం 31 బంతుల్లో 86 పరుగులు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఐపీఎల్ 2025లో అతని అద్భుతమైన ప్రదర్శనతో ఇప్పటికే స్టార్ క్రికెటర్ స్థాయికి చేరాడు. ఇప్పుడైతే క్రికెటర్‌గా తనకు అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. రాబోయే ఐపీఎల్ 2026కు ముందు ఈ యువ సంచలనంపై భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీని.. ధావన్ ప్రశంసించడమే కాకుండా సూటిగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవలే ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీని శిఖర్ ధావన్ పొగుడుతూనే తనకు ఓ వార్నింగ్ ఇచ్చాడు.
శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ” వైభవ్ 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడడం నిజంగా ఓ అద్భుతమైన విషయం. అతి చిన్న వయసులో టాప్ బౌలర్లను ఎదుర్కోవడం గొప్ప. ప్రపంచ క్రికెట్‌లోని స్ట్రాంగ్ బౌలర్ల ముందు ధైర్యంగా నిలబడడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అతడి భారీ షాట్లు కొట్టేటప్పుడు తన కాన్ఫిడెన్స్ అద్భుతం. ఐపీఎల్ పుణ్యమా అంటూ ఇప్పుడు మన దేశంలో ఐదేళ్ల వయసు నుంచే క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటున్నారు. అయితే వైభవ్ ఆ కలను నిజం చేసుకున్నాడు. ఇదే అతడు సాధించిన పెద్ద విజయం. ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లో 14 ఏళ్ల కుర్రాడు చెరగని ముద్ర వేయడం సాధరణ విషయం కాదు” అని శిఖర్ ధావన్ అన్నారు.
అంతే కాకుండా ఐపీఎల్ 2025లో రాహుల్ ద్రావిడ్ , విక్రమ్ రాథోర్ వంటి కోచ్‌లతో పనిచేయడం వైభవ్ అదృష్టమని ధావన్ అన్నాడు. వైభవ్ లైమ్‌లైట్ లోకి రావడానికి తమ వంతు సాయపడ్డారని చెప్పాడు. ఈ నేపథ్యంలో అతని ముందు ఓ పెద్ద సవాలే ఉందని ధావన్ షాకింగ్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వైభవ్‌కు వచ్చిన పేరు, ప్రఖ్యాతలతో పాటు డబ్బును ఎలా మెయిన్‌టైన్ చేస్తాడో తెలియాలి. మంచి క్రికెటర్ మాత్రమే కాదు.. మంచి మనిషిగా ఉండటం కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యమని శిఖర్ ధావన్ అన్నాడు.