India vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో భారత్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. క్షణక్షణం నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. ఈ గెలుపుతో ఈ టోర్నీలో పాక్‌ను మూడుసార్లు చిత్తు చేసిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది.
తెలుగోడి పోరాట పటిమ: 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (5), సూర్య (1), గిల్ (12) త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓటమి అంచున ఉన్న భారత ఇన్నింగ్స్‌ను యువ సంచలనం తిలక్ వర్మ (69* పరుగులు, 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) భుజానెత్తుకున్నాడు. నాలుగో వికెట్‌కు సంజు శాంసన్ (24)తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. శాంసన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబె (33 పరుగులు 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తిలక్ వర్మ దూకుడు పెంచాడు. ఈ జోడీ అద్భుతంగా ఆడి భారీ షాట్లతో స్కోరు బోర్డు వేగాన్ని పెంచింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ సిక్స్ బాదాడు. చివరి 3బంతుల్లో కేవలం ఒక్క పరుగు కావాల్సిన సమయంలో రింకు సింగ్ ఫోర్ కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఒత్తిడిని తట్టుకొని తిలక్ వర్మ ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది.
కుల్దీప్ మాయాజాలం.. పాక్ ఆలౌట్: అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు పాక్ ఓపెనర్లు గట్టి పోటీ ఇచ్చారు. సాహిబ్‌జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ భారీ స్కోరు చేసే దిశగా సాగింది. అయితే కీలక సమయంలో భారత స్పిన్నర్లు మాయాజాలం చేశారు. ముఖ్యంగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/30) ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తలో రెండేసి వికెట్లు తీయడంతో పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 19.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత బ్యాటర్లు ఉత్కంఠ భరితమైన విజయాన్ని అందించడంతో… దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.


