Jemimah Rodrigues- WBBL 2025: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు అండగా ఉండేందుకు తన సహచర క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ లీగ్ లో జెమీమా బ్రిస్బేన్ హీట్ తరుపున ఆడుతోంది.
స్నేహితురాలికి అండగా నిలిచేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న జెమీమా నిర్ణయాన్ని బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ కూడా గౌరవించింది. జెమీమా ఇప్పుడు కఠిన సమయాన్ని ఎదుర్కొంటోంది. ఆమె భారత్‌లోనే ఉండిపోవాలన్న డెసిషన్ తాము గౌరవిస్తాం. మా సపోర్టు జెమీమా, స్మృతి కుటుంబాలకు ఉంటుంది అని బ్రిస్బేన్ హీట్ సీఈఓ టెర్రీ స్వెన్సన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కెరీర్ కంటే ఫ్రెండ్ షిప్ కు విలువిచ్చిన జెమీమా నిర్ణయానికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Smriti Mandhana- స్మృతి మంధాన తండ్రి డిశ్చార్జ్
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి నాడు ఉదయం స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో వివాహ వేడుకను వాయిదా వేశారు. అందుతున్న సమాచారం ప్రకారం, స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వరుడు పలాష్ కూడా అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన పలు పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్మృతి మందాన పలాశ్ ముచ్చల్ ను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయిందనే వదంతులు ట్రెండ్ అవుతున్నాయి. స్మృతి తన పెళ్లికి సంబంధించిన అన్ని పోస్ట్‌లను సోషల్ మీడియా నుండి తొలగించింది. ఈమె చేసిన చర్య నెట్టింట పలు అనుమానాలకు తావిచ్చింది.

