Abhishek Sharma Creates History: ఆసియా కప్ 2025 సూపర్-4 తొలి పోరులో పాకిస్థాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ గెలుపు పొందడానికి ముఖ్య కారణం యువ బ్యాటర్ అభిషేక్ శర్మ. ఇతడు తన అసాధారణ బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. పాక్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలుకొట్టాడు. అవేంటో తెలుసుకుందాం.
అభిషేక్ ప్రపంచ రికార్డు..
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అభిషేక్ కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మెుత్తం 39 బంతులు ఎదుర్కొన్న అతడు ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో కూడా అభిషేక్ తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో రెండు సార్లు మెుదటి బంతికే సిక్స్ బాదిన తొలి ఇండియన్ క్రికెటర్ గా అభిషేక్ నిలిచాడు. దీంతోపాటు మరో ప్రపంచ రికార్డును కూడా ఇతడు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో 50 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఫీట్ ను అభిషేక్ 331 బంతుల్లోనే సాధించాడు. గతంలో ఈ రికార్డు విండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ పేరిట ఉండేది. అతను 366 బంతుల్లో 50 సిక్సర్లు కొట్టాడు.
Also read: AsiaCup – పాక్‌పై భారత్ మరో ఘన విజయం
అభిషేక్-గిల్ జోడీ అరుదైన ఘనత
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ దాయాది జట్టుపై అద్భుతమైన ఓపెనింగ్ పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఏకంగా 105 పరుగులు జోడించారు. పాక్ పై భారత ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం ఇదే తొలిసారి. 2012లో గౌతమ్ గంభీర్ మరియు అజింక్య రహానెలు చిరకాల ప్రత్యర్థిపై 77 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఇప్పటి వరకు అత్యుత్తమంగా ఉంటూ వచ్చింది. దానిని ఇప్పుడు ఈ యువ జోడి తిరగరాసింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ 74, గిల్ 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆసియా కప్ లో టీమిండియా హవా కొనసాగుతోంది. లీగ్ దశలో దాయాది జట్టును చిత్తు చేసిన టీమిండియా..సూపర్-4లోనూ వారిని మట్టికరిపించింది.


