IND vs AFG Test Match: చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరుతో చెలరేగింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో కదం తొక్కగా, సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో రాణించినప్పటికీ, భారత బ్యాటింగ్‌ను కట్టడి చేయలేకపోయారు.
అనంతరం ఈ రోజు తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు భారత బౌలింగ్ ధాటికి విలవిల్లాడుతూ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఆఫ్ఘాన్ తన తొలి ఇన్నిగ్స్‌లో 39.5 ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన స్పిన్నర్ మానవ్ సుతార్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 21 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్థాన్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కంటే ఇంకా 451 పరుగుల వెనుకబడి ఉంది.

