Tim Southee : న్యూజిలాండ్ పేసర్ టీమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. ఆక్లాండ్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 10 ఓవర్లలో 73 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఐదో కివీస్ ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. టెస్టుల్లో 300 వికెట్లు, వన్డేల్లో 200 వికెట్లు, టీ20ల్లో 100 వికెట్లు పైగా తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
తొలి వన్డేలో ధావన్‌ను ఔట్ చేయడం ద్వారా సౌథీ 200 వికెట్ల మైలురాయిని చేరాడు. వన్డేల్లో సౌథీ కంటే ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్ ఆటగాళ్లు ముగ్గురే ఉన్నారు. డేనియర్ వేటోరీ (297) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత కైల్ మిల్స్(240), క్రిస్ హారిస్(203) ఉన్నారు. మరో ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ కూడా 200 వికెట్లు తీశాడు. అయితే.. ఇతడిని సౌథీ అధిగమించాడు.
కివీస్ తరుపున సౌథీ ఇప్పటి వరకు 88 టెస్టుల్లో 347, 149 వన్డేల్లో 202, 107టీ20ల్లో 134 వికెట్లు పడగొట్టాడు.