Asia Cup 2025 Final match between India vs pak: సాధారణంగా ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా సాగిన టోర్నీ చివరి అంకానికి వచ్చేసరికి రసవత్తరంగా మారింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాక్ ఫైనల్‌లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇప్పటికే రెండుసార్లు చిత్తు: లీగ్ దశ,సూపర్-4లలో భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌ను రెండుసార్లు చిత్తు చేసింది. ఫైనల్‌లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ విజయంతో టైటిల్ గెలుచుకుంటే అంతకుమించి గొప్ప ముగింపు టీమ్ ఇండియాకు ఉండదని ఇండియా మొత్తం అభిప్రాయపడుతుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే పాకిస్థాన్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. సూపర్-4లో భారత్‌కు గట్టి పోటీనిచ్చిన పాక్ జట్టు ఫైనల్‌లో మరింత పట్టుదలతో పోరాడుతుందని భావిస్తున్నారు.
బలాబలాలు: టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు గెలిచి, బలాబలాల్లో మెరుగ్గా ఉన్నందున ఫైనల్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టీమ్ ఇండియాను కొన్ని అంశాలు కలవరపెడుతున్నాయి. చివరి సూపర్-4 మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ అభిషేక్ శర్మ గాయాలతో ఇబ్బంది పడ్డారు. వీరిద్దరూ ఫైనల్‌కు పూర్తిగా కోలుకుంటారని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో నిలకడగా రాణించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కలవరపెడుతున్న ఫీల్డింగ్ సమస్య: టోర్నీలో ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. ముఖ్యంగా చివరి మూడు మ్యాచ్‌లలో క్యాచ్‌లు వదిలేయడం జట్టుకు ఇబ్బందిగా మారింది. సూపర్-4లో పాక్‌కు మంచి స్కోర్ వచ్చిందంటే భారత ఫీల్డర్ల అలసత్వమే కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. అభిషేక్, సంజు, తిలక్ వర్మ ఫామ్‌లో ఉండడం జట్టుకు సానుకూలాంశంగా మారింది. లంకతో మ్యాచ్‌లో భారత బౌలింగ్ నిరాశపరిచినా.. ఫైనల్‌లో బుమ్రా, శివమ్ దూబే తిరిగి జట్టులోకి రానుండడంతో బౌలింగ్ బలం పెరుగుతుంది. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లు జట్టు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పాక్ బలహీనమైన మిడిలార్డర్‌కు సవాలు విసిరే అవకాశం ఉంది.
పాకిస్థాన్ ప్రదర్శన: పాక్‌కు బ్యాటింగే ప్రధాన సమస్యగా మారింది. ఓపెనర్లు ఫర్హాన్, జమాన్, అలాగే అయూబ్, హారిస్‌లపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ సల్మాన్ ఆఘా రాణిస్తేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు, షహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్‌తో కూడిన పాక్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఫైనల్‌లో టీమ్ ఇండియా ఈ బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. బలాబలాలు ఎలా ఉన్న ఈ రోజు జరిగే ఫైనల్ మాత్రం రసవత్తరంగా సాగనుందని క్రికెట్ పండితుల అంచనా.


