అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి.. గ్రూప్ -ఏలో అగ్ర భాగాన కొనసాగుతున్నారు. ఇప్పటికే భారత మహిళల జట్టు వెస్టిండీస్, మలేషియా జట్లను మట్టి కరిపించింది. తాజాగా కౌలాలంపూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ నమోదు చేసింది. విండీస్, మలేసియాపై ముందు బౌలింగ్ చేసిన జట్టు.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.. అయినా ఫలితం మాత్రం మారలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మనుడి నానయక్కర బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కమలిని (5) నిరాశపరిచింది. సానికా చాల్కే డకౌట్ కాగా.. నికి ప్రసాద్ (11), భావికా అహిరే (7), ఆయుషి శుక్లా (5) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. ఈ సమయంలో తెలంగాణ అమ్మాయి త్రిష ఒంటరి పోరాటం చేసింది. 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 49 రన్స్ చేసి అవుట్ అయ్యి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది.
మిథిలా వినోద్ (16), జోషిత (14), పరుణిక (1), షబ్నం (2), వైష్ణవి శర్మ (1) పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టాన్ని 118 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో లిమాంస తిలకరత్న, ప్రముది, అసెని తలో 2 వికెట్లు పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు వరుస షాకులు తగులుతున్నాయి. 4.2 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయింది. సంజన కవింది (5), సుముడు నిసంసాల (0), దహమి సనేత్మా (2), హిరుణి హన్సిక (2) అవుట్ అవగా.. కెప్టెన్ మనుడి నానయక్కర రనౌట్ అయ్యింది. రష్మిక సెవ్వండి (15), లిమాన్స తిలకరత్న (6), శశినీ గిమ్హాని (3), ఏసేని తలగునె(9) పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేసింది.
శ్రీలంక జట్టులో రష్మిక సెవ్వండి 15 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచింది. ఇక భారత బౌలర్లలో షబ్నం ఎండి షకీల్, జోషిత వీజీలు, పరుణిక సిసోడియా తలో రెండు వికెట్స్ పడగొట్టారు. ఇక ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మలు ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో అండర్ 19 టీ-20 వరల్డ్ కప్ లో భారత మహిళలు హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. మరో విశేషమేమిటంటే.. ఇప్పటి వరకూ భారత్ తో తలపడిన మూడు జట్లూ.. 60 పరుగుల ఫిగర్ ను టచ్ చేయలేకపోయాయి.