Monday, April 28, 2025
Homeఆటమరీ ఇంత వైలెంట్‌గా ఉన్నాడేంటి భయ్యా.. వైభవ్ ఊచకోత.. ఐపీఎల్‌లో సూపర్ సెంచరీ..!

మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నాడేంటి భయ్యా.. వైభవ్ ఊచకోత.. ఐపీఎల్‌లో సూపర్ సెంచరీ..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో అద్భుతం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ చిన్నోడు బ్యాట్‌తో కోహినూర్ వజ్రంలా మెరిశాడు. జాతీయ స్థాయిలో తొలి సీజన్ ఆడుతున్నప్పటికీ అత్యద్భుతమైన స్టైల్‌లో తన ప్రతిభను చాటాడు.

- Advertisement -

గుజరాత్ టైటాన్స్ పెడిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగినప్పుడు, అందరూ నెమ్మదిగా ఆరంభిస్తారని ఊహించారు. కానీ వైభవ్ సూర్యవంశీ దృశ్యాన్ని పూర్తిగా మార్చేశాడు. ఒక్కో బంతిని ధాటిగా ఆడుతూ, ఫోర్లు, సిక్సుల వర్షం కురిపిస్తూ మైదానాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. తొలి 17 బంతుల్లోనే అర్థ సెంచరీని పూర్తి చేసిన వైభవ్, ఆ తర్వాత మరింత వేగంతో ఆట కొనసాగించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీని నమోదు చేసి ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం సాధించిన ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు.

ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ప్రతి షాట్‌లో విశ్వాసం కనిపించింది. గాల్లోకి ఎగిరే బంతులను అలవోకగా బౌండరీలకు తరలించాడు. అతని బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. స్టేడియంలో విల్ చైర్‌లో కూర్చున్న ద్రవిడ్, వైభవ్ ఇన్నింగ్స్ చూసి స్ధానం నుంచి లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాడు. ఈ దృశ్యం మొత్తం స్టేడియాన్ని మంత్రిముగ్ధం చేసింది.

వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్ ద్వారా పలు రికార్డులను ధ్వంసం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. కెరీర్‌లోనే తొలి T20 సెంచరీని అత్యంత వేగంగా నమోదు చేశాడు. అంతే కాదు, భారతీయులలో అత్యంత వేగంగా ఐపీఎల్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా పేరు సంపాదించాడు. క్రిస్ గేల్ తర్వాత రెండో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఐపీఎల్ చరిత్రలో తన స్థానం సంపాదించుకున్నాడు.

ఒక చిన్న వయస్సులో ఇలాంటి సంచలన ప్రదర్శన ఇవ్వడం ఓ మామూలు విషయం కాదు. తన ఆటతీరు, సమయపాలన, ఆటపై ఉన్న పట్టుదల చూస్తుంటే, భారత క్రికెట్‌కు భవిష్యత్‌లో మరో స్టార్ దొరికినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News