నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో ఇంటర్నేషనల్ క్యాంప్ వెళ్లాలని ప్రతి క్యాడెట్ కలలు కంటారు. కానీ పిడికెడుమందికి కూడా ఈ సువర్ణావకాశం రాదు. అంతర్జాతీయ స్థాయిలో మనదేశ ప్రతినిధిగా విదేశాలకు వెళ్లటం అంటే మాటలు కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్.సి.సి. క్యాడెట్స్ అంతా ఈ అవకాశం కోసం శ్రమిస్తారు. కానీ ఎన్నో దశలు విజయవంతంగా పూర్తి చేసి, కఠినమైన క్యాంపుల్లో మెరిట్ చూపితే కానీ ఇంటర్నేషనల్ క్యాంప్ ప్రవేశ పరీక్షకు అర్హత సైతం దక్కదు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన క్యాంప్ లో మన తెలుగు తేజం వైష్ణవి మడుపు నెగ్గుకువచ్చి, ఇంటర్నేషనల్ క్యాంప్ కు వెళ్లే భారత బృందంలో చోటు సంపాదించటం హైలైట్.
కజకిస్థాన్ టూర్..
ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీ 17వ తేదీ వరకు భారత ఎన్.సి.సి. బృందం కజకిస్థాన్ పర్యటన సాగనుంది. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాములో భాగంగా ఈ ఇంటర్నేషనల్ క్యాంప్ సాగనుంది. కజకిస్థాన్ కు వెళ్తున్న ఈ బృందంలో మొత్తం 12 మంది ఉండగా వైష్ణవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ యూత్ సర్కిల్ లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
జూనియర్ అండర్ ఆఫీసర్..
తెలంగాణ గర్ల్స్ బెటాలియన్ తరపున వైష్ణవి మడుపు కజకిస్థాన్ లో పర్యటించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ లో బీకాం ఆనర్స్ చదువుతున్న వైష్ణవి ఎన్.సి.సి.లో జూనియర్ అండర్ ఆఫీసర్ గా ఉన్నారు. రిపబ్లిక్ డే క్యాంప్ లో బీ సర్టిఫికెట్ అందుకున్న వైష్ణవి ఇప్పటికే 8 కఠినమైన లెవెల్స్ ను నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో పూర్తిచేసి మరో అడుగు ముందుకు వేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని చేజిక్కించుకుంది.
అంత ఈజీ కాదు..
యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాము కోసం క్యాడెట్స్ ఎంపిక విధానం అత్యంత కఠినంగా ఉంటుంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షతో పాటు గ్రూప్ డిస్కషన్ లో అత్యద్భుత ప్రతిభ కనబరచిన ఎన్సీసీ అభ్యర్థులకు మాత్రమే ఇంటర్నేషనల్ క్యాంపుకు పంపుతారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ సెలక్షన్స్ చాలా కష్టం కూడా.