Tennis: వీనస్ విలియమ్స్ సుదీర్ఘ విరామం తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌లో పునరాగమనం చేసింది. చివరిసారిగా 2024 మయామి ఓపెన్‌లో వీనస్ విలియమ్స్ ఆడింది. ఆ సమయంలో గాయాల కారణంగా వీనస్ విలియమ్స్ ఆటకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. సరిగ్గా ఏడాది తర్వాత సిటీ డీసీ ఓపెన్–500 లో రాకెట్ పట్టి విజయం సాధించింది.
తన కెరీర్‌లో సింగిల్స్, డబుల్స్‌లో కలిపి 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 45 ఏళ్ల వీనస్ తన దేశానికే చెందిన హైలీ బాప్టిస్ట్‌తో కలిసి డీసీ ఓపెన్ డబుల్స్‌లో ఆడుతోంది. తొలి రౌండ్‌లో వీనస్–హైలీ జంట 6–3, 6–1తో 2014 వింబుల్డన్ రన్నరప్ యూజీనీ బుచార్డ్ (కెనడా)–క్లార్వీ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది. మూడేళ్ల తర్వాత డబుల్స్ మ్యాచ్ ఆడిన వీనస్… కిక్కిరిసిన మైదానంలో మొదట తడబడినా… ఆ తర్వాత తన ట్రేడ్‌మార్క్ షాట్‌లతో ఆకట్టుకుంది.
2024 మయామి ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు దూరమైన వీనస్ వైల్డ్ కార్డ్‌తో తాజా టోర్నీలో బరిలోకి దిగింది. సిటీ డీసీ ఓపెన్–500 టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో 45 ఏళ్ల వీనస్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో వీనస్‌ప్రపంచ 35వ ర్యాంకర్ పేటన్ స్టెర్న్స్‌పై గెలుపొందింది. 97 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్ సాగింది. ఈ గెలుపుతో మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్‌లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయస్కురాలిగా వీనస్ గుర్తింపు పొందింది.


