ఐదు మ్యాచుల టీ-20 సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో సూర్యకుమార్ యాదవ్ సేన ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. ఫలితంగా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఈ మ్యాచ్ లో అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ భారత్ తొలి టీ20లో ఇంగ్లాండ్ పై గెలిచింది. పూర్తి ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అయితే తొలి టీ-20 ఓటమితో.. ఇంగ్లాండ్ జట్టు రగిలిపోతోంది. దీంతో టీమిండియాను తక్కువ చేస్తూ ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మాట్లాడాడు.
తొలి టీ-20లో టీమిండియాకు ఏదో అదృష్టం కలిసి వచ్చిందని.. అందుకే గెలిచారని అన్నాడు. ఇక శనివారం చెన్నై వేదికగా జరగనున్న రెండో మ్యాచ్ లో తామేంటో చూపిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. టీమ్ ఇండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయని అయితే.. అవి ఫీల్డర్లకు దూరంగా వెళ్లడంతో వారు ఔట్ కాకుండా బతికిపోయారన్నాడు. అవన్నీ ఫీల్డర్ల చేతుల్లో పడి ఉంటే భారత్ 40 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఉండేదని, అప్పుడు ఫలితం మరోలా ఉండేదని అంటున్నాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ మిగతా బౌలర్లతో పోలిస్తే తనకు కాస్త ఎక్కువగానే సహకరించిందని జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. మా టీమ్‌లోని బౌలర్లు మంచిగానే బౌలింగ్ చేశారు. అయితే.. భారత బ్యాటర్లకు అదృష్టం కలిసి వచ్చిందన్నాడు. భారత బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయి.. అయితే అవి ఫీల్డర్లకు కాస్త దూరంలో పడ్డాయి. అవే గనుక చేతుల్లో పడి ఉంటే భారత టాప్ 6 వికెట్లు 40 పరుగులకే తీసే వాళ్లం, అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు. రెండో టీ20 మ్యాచ్‌లో తప్పకుండా భారత్‌ను కట్టడి చేస్తామని తెలిపాడు.
తొలి టీ20 మ్యాచులో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా.. ఆర్చర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ల తప్పులను కప్పి పుచ్చుకునేందుకు భారత్ పై కామెంట్లు చేస్తున్నావని మండిపడుతున్నారు. మరి జోఫ్రా వ్యాఖ్యలకి టీమిండియా ఆటగాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.