Bernard Julien death : వెస్టిండీస్ క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకప్పుడు తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కరీబియన్ జట్టుకు వెన్నెముకగా నిలిచిన మాజీ దిగ్గజం, 1975 ప్రపంచ కప్ హీరో బెర్నార్డ్ జూలియన్ (75) శనివారం రాత్రి కన్నుమూశారు. ట్రినిడాడ్‌లోని వల్సేన్‌లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆయన మరణ వార్తతో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అసలు ఎవరీ బెర్నార్డ్ జూలియన్? ప్రపంచ కప్ విజయంలో ఆయన పాత్ర ఎంతటి కీలకమైనది?
తుఫానులా అరంగేట్రం.. ఆల్‌రౌండ్ మెరుపులు : 1950 మార్చి 13న ట్రినిడాడ్‌లోని కారెనేజ్‌లో జన్మించిన బెర్నార్డ్ జూలియన్, తన 18వ ఏట ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టారు. ఎడమచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్ మరియు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా జట్టులో సమతూకం తీసుకొచ్చిన జూలియన్, 1973లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆడిన మూడో టెస్టులోనే, క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో కేవలం 127 బంతుల్లో 121 పరుగులు చేసి సంచలనం సృష్టించారు. ఆ ఇన్నింగ్స్‌లో ఆయన దిగ్గజ ఆటగాడు గ్యారీ సోబర్స్‌తో కలిసి 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.
1975 ప్రపంచ కప్ హీరో : వెస్టిండీస్ తొలిసారిగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ను ముద్దాడటంలో జూలియన్ పోషించిన పాత్ర అమోఘం. ఆ టోర్నమెంట్‌లో ఆయన బంతితో అద్భుతాలు చేశారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. అంతేకాకుండా, న్యూజిలాండ్‌తో జరిగిన కీలక సెమీ-ఫైనల్లో 27 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి విండీస్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ బంతితో రాణించి, ఆ తర్వాత బ్యాటింగ్‌లో అజేయంగా 26 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశారు.
ఆయన తన కెరీర్‌లో వెస్టిండీస్ తరపున 24 టెస్టులు, 12 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 30.92 సగటుతో 866 పరుగులు సాధించడంతో పాటు 50 వికెట్లు తీశారు. వన్డేల్లో 18 వికెట్లు పడగొట్టారు. అయితే, కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్ క్రికెట్‌లో పాల్గొనడం మరియు వర్ణవివక్ష కారణంగా దక్షిణాఫ్రికాపై అంతర్జాతీయ నిషేధం ఉన్న సమయంలో అక్కడి రెబల్ టూర్‌లలో ఆడటంతో ఆయన అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది.
జూలియన్ మృతి పట్ల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు డా. కిషోర్ షాలో, నాటి కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. “జూలియన్ జట్టు కోసం 100 శాతానికి పైగా కష్టపడేవాడు. అతనిపై బ్యాట్‌తో, బంతితో ఎప్పుడూ ఆధారపడగలిగేవాడిని. ఒక అద్భుతమైన క్రికెటర్‌ను కోల్పోయాం” అని క్లైవ్ లాయిడ్ గుర్తు చేసుకున్నారు.


