Tilak Varma Injury Update in Telugu: భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన తెలుగు తేజం తిలక్ వర్మ పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో త్వరలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. అంతేకాకుండా వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ లో తిలక్ ఆడటంపై కూడా ఇప్పుడు సందిగ్ధత నెలకొంది.
విజయ్ హజారే ట్రోఫీలో..
రాజ్‌కోట్‌లో హైదరాబాద్ జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న సమయంలో తిలక్ వర్మ పొత్తికడుపులో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతడిని బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE)కు తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తిలక్ కనీసం 3 నుండి 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అవసరమైతే సర్జరీ చేయించుకోవాలని వైద్య బృందం సూచించినట్లు సమాచారం.
తిలక్ స్థానంలో ఎవరంటే?
ఫిబ్రవరి 7న అమెరికాతో భారత్ తన వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది. అయితే తిలక్ కోలుకోవడానికి నెల రోజులు పడితే, సెలెక్టర్లు ప్రత్యామ్నాయాల వైపు చూడక తప్పదు. గత ఏడాది ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత హాఫ్ సెంచరీ బాదిన తిలక్, భారత మిడిల్ ఆర్డర్ కు వెన్నెముకగా మారాడు. తిలక్ అందుబాటులో లేకపోతే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లేదా రియాన్ పరాగ్ లలో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది.
Also Read: Vaibhav Suryavanshi – ‘పుష్ప’ స్టైల్‌లో వైభవ్ విధ్వంసం.. 10 సిక్సర్లు, 9 ఫోర్లతో ఊచకోత!
తిలక్ వర్మ టీ20 గణాంకాలు..
2023 ఆగస్టులో అరంగేట్రం చేసినప్పటి నుండి తిలక్ టీ20ల్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. 40 మ్యాచుల్లో అతడు 49.29 సగటు, 144.09 స్ట్రైక్ రేట్ తో 1,183 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 120*. కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా తన పార్ట్-టైమ్ బౌలింగ్‌తోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ కు తిలక్ అందుబాటులో లేకపోవడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బే అనే చెప్పాలి.

