Deepak Hooda : ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 300 పై చిలుకు పరుగులు సాధించినప్పటికి బౌలర్ల వైఫల్యం కారణంగా ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగింది. మరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడంతో కెప్టెన్ శిఖర్ ధావన్ సదరు బౌలర్లను కొడుతున్నప్పటికీ అతడికే బంతి ఇవ్వడం మినహా ఏం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో కనీసం రెండో వన్డే మ్యాచ్‌లోనైనా జట్టులోకి ఓ ఆల్‌రౌండర్‌ను ఎంచుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.
తొలి మ్యాచ్ గురించి టీమ్ఇండియా మాజీ సెలక్టర్ సబా కరీం స్పందించాడు. ఆల్‌రౌండర్‌ను తీసుకోకుండా అదనపు బ్యాటర్‌ను భారత జట్టు ఎందుకు తీసుకుందో తనకైతే అర్థం కాలేదన్నాడు. టీ20 సిరీస్‌లో రాణించిన దీపక్ హుడాని తీసుకుని ఉండి ఉంటే పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చేదేమోనని అభిప్రాయపడ్డాడు. దీపక్ హుడా బంతితో పాటు బ్యాటింగ్‌లోనూ ఉపయోగపడేవాడు అని తెలిపాడు.
ఇటీవల భారత జట్టు కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడుతోందన్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపాడు. సెలక్టర్లు చాలా మంది బ్యాటర్లతో కూడిన జట్టునే ప్రకటిస్తున్నారని, మరి ఆల్‌రౌండర్లు ఎక్కడ అని ప్రశ్నించారు. సెలక్షన్ కమిటీ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసం ఉందన్నాడు. బ్యాటర్లు స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లు ఆడుతుంటే మన స్పిన్నర్లు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఎలా బౌలింగ్ చేయాలనే సన్నద్దత కొరవడిందని చెప్పారు. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే భవిష్యత్తులోనూ ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుదని చెప్పుకొచ్చాడు.