ఐపీఎల్ 18వ సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచులు క్రీడా అభిమానులను అలరించాయి. ఇక శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ను చెన్నై, బెంగళూరు జట్లు విజయాలతో ప్రారంభించాయి. బెంగళూరు కోల్‌కతాపై, చెన్నై ముంబైపై గెలిచాయి. ఇప్పుడు అదే జోరు కొనసాగించాలని ఇరు జట్లూ ప్రయత్నిస్తున్నాయి. అయితే చెన్నై కంచు కోట చెపాక్‌లో బెంగళూరు గెలుస్తుందా.. అనే అనుమానం అందరిలో ఉంది.
ఐపీఎల్ మొదలై 18 ఏళ్ళు అవుతోంది. గత 17 ఏళ్ళలో చెపాక్‌లో బెంగళూరు గెలవలేదు. 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్‌లో చివరిసారిగా చెన్నైలో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. 2009 నుంచి చెపాక్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో బెంగళూరుకు నిరాశే మిగిలింది. 2008-24 మధ్య చెపాక్‌లో చెన్నై, బెంగళూరు మధ్య 9 మ్యాచ్‌లు జరిగితే, చెన్నై 8సార్లు గెలిచింది. బెంగళూరు కేవలం ఒక మ్యాచ్ గెలిచింది. అలాగే మొత్తం 33 మ్యాచ్‌లలో చెన్నై 21సార్లు విజయం సాధించింది. ఈ రికార్డ్స్ చెన్నైకి అనుకూలంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో అయినా చెన్నై కోటను బెంగళూరు బద్దలు కొడుతుందో చూడాలి.
ప్రస్తుతం బెంగళూరు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీతో పాటు రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మల బ్యాటింగ్ బాధ్యతలను మోస్తున్నారు. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలం కావడంతో జాకబ్ బెతెల్, టిమ్ డేవిడ్‌లలో ఒకరు ఆడే అవకాశాలు ఉన్నాయి. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫిట్‌గా ఉంటే తుది జట్టులో ఆడతాడు. గత మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేయగా, పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో కృనాల్ పాండ్య, జోష్ హాజిల్‌వుడ్ సత్తాచాటారు. వీరందరూ చెలరేగితే, విజయం పెద్ద కష్టమేమి కాదు.
చెన్నై జట్టు విషయానికి వస్తే.. ఆ జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ముంబైపై CSK తరఫున ఆడిన ముగ్గురు అద్భుతంగా రాణించారన్నారు. ఆ జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ చెపాక్ స్టేడియంలో అసాధారణంగా రాణిస్తారు. ఈ పిచ్ పై వారిని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. CSK తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే నూర్ మహ్మద్ అసాధారణ ప్రదర్శన ఇచ్చాడు. ఇక ముంబైతో జరిగిన చివరి మ్యాచ్‌లో శివమ్ దూబే, దీపక్ హుడా, సామ్ కుర్రాన్ రాణించకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ తమ మిడిల్ ఆర్డర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని కోరుకుంటోంది. రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లకు మరింత మద్దతు లభించాలి. ఇక చివర్లో ధోనీ క్రీజులోకి వచ్చి ఒకటి రెండు షాట్లు ఆడితే చాలని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.