సౌతాఫ్రికా(South Africa) జట్టు తొలిసారిగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. సెంచూరియన్ వేదికగా పాకిస్థాన్(Pakistan) జట్టుతో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన విజయం సాధించి WTC తుదిపోరుకు దూసుకెళ్లింది. ఈ మ్యాచులో 148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ప్రొటీస్ జట్టుకు పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓవర్ నైట్ స్కోరు 27/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికాను మార్‌క్రమ్ (37), బావుమా (40) అదుకున్నారు. ఓ దశలో 93/4 పరుగుల స్కోరుతో సునాయాసంగా విజయం సాధించేలా ఉన్న సఫారీ జట్టు కేవలం 12 బంతుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది
ఇక విజయానికి 49 పరుగులు కావాల్సిన తరుణంలో టెయిలెండర్లు కగిసో రబాడ(31), మార్కో జాన్సన్(16) అద్భుతంగా పోరాడారు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే జట్టుకు విజయం అందించి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు తీసుకెళ్లారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ (6/54) వికెట్లతో సత్తాచాటాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 211 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా 301 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 237 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా WTC ఫైనల్ చేరడంతో మిగిలిన బెర్త్ కోసం భారత్, ఆస్ట్రేలియా పోటీ పడుతున్నాయి.