Cheating case filed on Yash Dayal: ఐపీఎల్ ప్రాంఛైజీకి చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు యశ దయాళ్ పై లైంగిక ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. యష్ తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.
పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తన దగ్గర డబ్బులు కూడా తీసుకుని ఇతర యువతులతో ఎంజాయ్ చేసేవాడని ఫిర్యాదులో ఆరోపించింది. తనను కోడలిగా తన తల్లిదండ్రులకు, బంధువులకు కూడా పరిచేశాడని.. దీంతో తనను ఎంతో నమ్మానని పేర్కొంది. అయితే అతడు తనను మోసం చేస్తున్న విషయం తెలుసుకుని గట్టిగా నిలదీయగా మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది.
యశ్ తనతో రిలేషన్ లో ఉన్నట్లు కాల్ రికార్డులు, చాట్ స్క్రీన్ షాట్లు, ఫొటోలు ఆధారాలుగా ఉన్నాయని తెలిపింది. ప్రేమ పేరుతో వేరే యువతును కూడా మోసం చేసినట్లు తెలిసిందని ఆరోపణలు చేసింది. దీనిపై మహిళా హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసినా ఉపయోగం లేదని తెలిపింది. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ కంప్లీట్ ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగడం లేదని పేర్కొంది. తనకు న్యాయం జరగదని భావించి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు ఆ యువతి వెల్లడించింది.
అయితే యువతి ఫిర్యాదుపై సీఎంవో కార్యాలయం వెంటనే స్పందించింది. ఈ కేసు విచారణకు ఘజియాబాద్‌లోని ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్ ను నియమించింది. తమకు అందిన ఈ ఫిర్యాదును జులై 21లోగా పరిష్కరించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను తమకు సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఈ ఏడాది ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలవడంలో యశ్ దయాళ్ కీలక పాత్ర పోషించాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను కట్టడి చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా కీలకమైన స్పెల్ వేసి జట్టు విజయానికి కారకుయ్యాడు.