Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ లో కీలక పోరు జరగనుంది. ఇవాళ సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. బుధవారం గౌహతి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లాండ్‌ను అడ్డుకోవడం సౌతాఫ్రికా ముందున్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సెమీస్ చేరే క్రమంలో దక్షిణాఫ్రికా రెండు భారీ పరాజయాలు చవిచూసింది. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ల ధాటికి తన తొలి మ్యాచ్‌లో 69కే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత చాలా బాగా రాణించింది. న్యూజిలాండ్, భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లపై విజయాలు సాధించి, ముందంజ వేసింది. అయితే స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆ జట్టు బలహీనత ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మరోసారి బహిర్గతమైంది.
Read Also: Bigg Boss Trolls: నీ మొహం చూస్తేనే చిరాకు.. నీ వీడియోస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఆస్ట్రేలియాతో పోరులో తడబాటు..
ఆస్ట్రేలియాతో పోరులో సఫారీల జట్టు తడబడింది. ఆసీస్ లెగ్‌స్పిన్నర్ అలానా కింగ్ (7/18) మ్యాజిక్ కు ఆ జట్టు 24 ఓవర్లలో 97 పరుగులకే ఆగిపోయింది. ఈ ఇబ్బందిని అధిగమించకపోతే సౌతాఫ్రికాకు చిక్కులు తప్పవు. సెమీస్‌లో ఆ జట్టు బలహీనతను వాడుకునేందుకు ఇంగ్లాండ్ తప్పక ప్రయత్నిస్తుంది. తమ స్పిన్ త్రయం సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సీ స్మిత్, చార్లీ డీన్‌లతో సౌతాఫ్రికాను మరోసారి దెబ్బతీయడానికి ఇంగ్లాండ్ రెడీ అవుతోంది. అయితే గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ ఎకిల్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో ఆడడమే కష్టమే. ఇక బ్యాటింగ్‌లో కెప్టెన్ లారా వోల్వార్ట్‌పైనే దక్షిణాఫ్రికా ఎక్కువగా ఆధారపడుతోంది. టోర్నీలో ఇప్పటివరకు ఆమె 50.16 సగటుతో 301 పరుగులు చేసింది. ఆమె కాకుండా నిలకడగా ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు లేరనే చెప్పారు. లుజ్ (157 పరుగులు), మరిజేన్ కాప్ (162 పరుగులు) కూడా నిలకడగా రాణించలేదు. ఈ మ్యాచ్‌లో వాళ్లు మెరవాలని సౌతాఫ్రికా ఆశిస్తోంది.
Read Also: Bigg Boss Elimination: జనాలు గొర్రెలా? అంతా అగ్రిమెంటు ప్రకారమేనా ఇన్ ఔట్?
విశ్వాసంతో ఉన్నఇంగ్లాండ్
మరోవైపు.. తన తొలి మ్యాచ్‌లో ఇదే గౌహతిలో దక్షిణాఫ్రికాను 10 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్.. ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కొన్నిసార్లు తడబడినా.. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ మెరుగ్గానే ఉంది. కెప్టెన్ నాట్ సీవర్ (198), హెదర్ నైట్ (288), వికెట్‌కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ (220) ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఓపెనర్ బ్యూమాంట్ నిలకడగా రాణించకపోవడం ఆ జట్టును ఇబ్బందిపెడుతోంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎమ్మా లాంబ్, సోఫియా డంక్లీ బ్యాట్ తో మెరుపులు మెరిపించాల్సిందే. నాట్ సీవర్ బ్యాటుతోనే కాక బాల్ తోనూ మ్యాజిక్ చేయాలి. ఇకపోతే, మ్యాచ్‌కు వర్షం ముప్పుంది. సెమీఫైనల్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. ఆ రోజు మ్యాచ్ ఫలితం రాకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో నిలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.


