Haryana: భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పురాతన క్రీడలలో కబడ్డీ ఒకటి. గ్రామీణ స్థాయిలో ప్రారంభమైన ఈ ఆట ఇప్పుడు అంతర్జాతీయ గౌరవాన్ని సాధించింది. తాజాగా హర్యానాలో జరిగిన ఓ ప్రత్యేక కబడ్డీ మ్యాచ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించడం ద్వారా, ఈ ఆట ప్రపంచ దృష్టిని మరోసారి ఆకర్షించింది.
2024 మార్చి 24న, హర్యానా రాష్ట్రం పంచకులలో నిర్వహించిన కబడ్డీ ప్రదర్శన మ్యాచ్ ప్రపంచ రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక మ్యాచ్‌లో 128 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మ్యాచ్ మొత్తం 2 గంటల 9 నిమిషాల పాటు కొనసాగింది. ఒకే మ్యాచ్‌లో ఇంత పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో, గిన్నిస్ బుక్‌లో ఇది ప్రత్యేకంగా నమోదైంది. ఈ ప్రదర్శనకు యువత, క్రీడాభిమానులు మరియు స్థానిక క్రీడాకారుల నుంచి మంచి స్పందన లభించింది.
Read more: https://teluguprabha.net/sports-news/sumit-jamwal-national-kickboxing-bronze-medal/
ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు హోలిస్టిక్ ఇంటర్నేషనల్ ప్రవాసీ స్పోర్ట్స్ అసోసియేషన్ (HIPSA) ఆధ్వర్యంలో నమోదైంది. HIPSA అధ్యక్షురాలు కాంతి డి.సురేశ్, GI-PKL వ్యవస్థాపకుడు కార్తిక్ దమ్ము కలిసి ఈ గౌరవ సర్టిఫికేట్‌ను హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సైనీకి ఆదివారం హర్యానా భవన్‌లో అందజేశారు. సీఎం నయబ్ సైనీ మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధిక పతకాలు తీసుకొచ్చే క్రీడాకారులు హర్యానా నుంచే రావాలని ఆశిస్తున్నాను. ప్రతి గ్రామం నుంచి ఒక అథ్లెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నదే మా లక్ష్యం అని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో HIPSA నిర్వహించిన గ్లోబల్ ఇండియన్ ప్రవాసి కబడ్డీ లీగ్ (GI-PKL) కి కూడా మంచి స్పందన లభించింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా వంటి ఖండాల నుంచి భారతీయ ప్రవాస క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను క్రీడల ద్వారా కలిపే ప్రయత్నాల్లో HIPSA ముందంజలో ఉంది.
కబడ్డీకి గౌరవం తెచ్చిన ఈ గిన్నిస్ రికార్డు, హర్యానా రాష్ట్ర క్రీడాసంస్కృతికి మంచి గుర్తింపు ఇచ్చింది. HIPSA, GI-PKL వంటి సంస్థలు క్రీడల ద్వారా భారతీయుల ఐక్యతను ప్రపంచానికి చూపించేందుకు ఎంతో కృషి చేస్తున్నాయి.


