ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final)ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెస్టెన్ బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచి టెస్టు ఛాంపియన్ షిప్ గద ఎత్తుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి విజేతగా నిలవాలని భావిస్తుంటే.. తొలిసారి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడాలని దక్షిణాఫ్రికా జట్టు కోరుకుంటోంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఐదు రోజుల పాటు ఆట సజావుగానే సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ జూన్ 11 నుంచి 15 వరకు జరగనుంది. జూన్ 16 రిజర్వ్ డే కింద కేటాయించారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఆట ఆగిపోతే.. రిజర్వ్ డే మిగిలిన ఆట నిర్వహిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
భారత్ లో ఈ మ్యాచ్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లు సొంతం చేసుకున్నాయి. టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్, డిజిటల్ లో అయితే జియో హాట్ స్టార్ వేదికగా లైవ్ చూడొచ్చు. కాగా 2021లో జరిగిన తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిన్ టైటిల్ న్యూజిలాండ్ జట్టు గెలుచుకోగా.. 2023 WTC గదను ఆస్ట్రేలియా ముద్దాడింది. ఈ రెండు ఫైనల్ మ్యాచ్ లలో భారత్ రన్నరప్ గా నిలవడం గమనార్హం.
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.
ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హేజిల్‌వుడ్.