Yashasvi Jaiswal| ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత క్రికెటర్ యశస్వి జైశ్వాల్ ప్రపంచ రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (34) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ ఆల్‌టైమ్ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ (33) పేరిట ఉండేది. అతడు 2014 క్యాలెండర్ ఇయర్‌లో 33 సిక్సర్లు బాదాడు.
ఇక ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో రాహుల్-జైశ్వాల్ రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం(172*) నమోదు చేశారు. 1986లో దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ జోడీ 191 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా.. 1981లో గావస్కర్, చేతన్ చౌహాన్ ద్వయం 165 రన్స్ చేసింది. అలాగే 2004లో డాషింగ్ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా జోడీ తొలి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
ఇదిలా ఉంటే 2000 సంవత్సరం నుంచి SENA(సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు 100కుపైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన భారత ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డును కేఎల్ రాహుల్ సమం చేశాడు. సెహ్వాగ్ మూడు సార్లు ఈ రికార్డు నమోదు చేయగా.. రాహుల్ కూడా మూడు సార్లు ఈ భాగస్వామ్యం నమోదు చేశాడు. కాగా ఈ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 172 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 218 పరుగుల ఆధిక్యం లభించింది.