Australia cricketer: ఆస్ట్రేలియా క్రికెట్ మళ్లీ దుఃఖంలో మునిగిపోయింది. పదకొండేళ్ల క్రితం ఫిల్ హ్యూస్ మైదానంలో బంతి తాకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పటికీ అభిమానుల హృదయాలను కదిలిస్తూనే ఉంది. అదే విధంగా మరోసారి ఇలాంటి విషాదం చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ బెన్ అస్టిన్ మైదానంలోనే ప్రాణాలు విడిచాడు.
టీ20 మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్న బెన్ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంటున్నాడు. సాధన సమయంలో బంతి అతడి మెడను బలంగా తాకింది. ఒక్కసారిగా నేలపై కుప్పకూలిన అతడిని సహచర ఆటగాళ్లు పరుగున ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రెండు రోజులపాటు ప్రాణాలతో ఉంచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గురువారం ఉదయం అస్టిన్ తుదిశ్వాస విడిచాడని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగిందని స్థానిక క్రికెట్ వర్గాలు తెలిపాయి.
అతడు ప్రాక్టీస్ సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ బంతి వేగం అంతగా ఉండటంతో ప్రాణాపాయం తప్పలేదని తెలుస్తోంది. క్రీడా సమాజంలో విషాదం అలుముకుంది. బెన్ కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఫుట్‌బాల్ పట్ల కూడా ఆసక్తి చూపేవాడని స్నేహితులు చెబుతున్నారు. క్రీడలంటే పిచ్చి ఉన్న బాలుడు ఒక్కసారిగా లేకపోవడం అందరికీ నమ్మలేని షాక్ ఇచ్చింది.
బెన్ మరణంపై ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ హృదయవిదారక ప్రకటన విడుదల చేసింది. “బెన్ మా క్లబ్‌లో ప్రతిభావంతుడైన ఆటగాడు. క్రికెట్‌కి మాత్రమే కాకుండా ఫుట్‌బాల్‌లో కూడా అద్భుత ప్రతిభ చూపేవాడు. అతని ఆకస్మిక మరణం మా కమ్యూనిటీని తీవ్రంగా కలచివేసింది. ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం. దయచేసి వారి గోప్యతను గౌరవించండి” అని పేర్కొంది.
ఫిల్ హ్యూస్ ఘటనను గుర్తు చేసే ఈ మరణం మరోసారి క్రికెట్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. క్రీడ అంటే ఉత్సాహం, పోటీ, కలలు… కానీ కొన్ని క్షణాల్లోనే ఆ కలలు ఆగిపోవడం మనసును కలచేస్తోంది. అభిమానులు సోషల్ మీడియాలో బెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మైదానంలో మొదలైన అతని ప్రయాణం, అక్కడికే ముగియడం క్రికెట్ ప్రపంచానికి శోకం మిగిల్చింది.


