మరో భారత క్రికెటర్ విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతేడాది టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక పాండ్యా-నటాషా దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాండ్యా బాటలోనే స్పిన్నర్ యజువేంద్ర చాహల్(Yuzvendra Chahal) పయనిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా చాహల్-ధనశ్రీ దంపతులు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ‘అన్‌ఫాలో’ చేసుకున్నారు.
తాజాగా ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో ధనశ్రీతో ఉన్న అన్ని చిత్రాలను తొలగించాడు. అయితే ధనశ్రీ మాత్రం భర్తతో ఉన్న ఫొటోలను తొలగించలేదు. ఈ జంట కచ్చితంగా విడాకులు తీసుకోనుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరిద్దరూ విడిపోయేందుకు కచ్చితమైన కారణాలు తెలియదని పేర్కొన్నాయి. కాగా 2020లో కొరియోగ్రాఫర్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, దంత వైద్యురాలైన ధనశ్రీ వర్మను చాహల్ పెళ్లాడారు. వీళ్లిద్దరూ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెడుతూ అభిమానుల్ని అలరిస్తూ ఉంటారు.