Monday, June 24, 2024
Homeటెక్ ప్లస్11-digit numbers  soon: ఫోన్ నంబ‌ర్లు అయిపోతున్నాయా?

11-digit numbers  soon: ఫోన్ నంబ‌ర్లు అయిపోతున్నాయా?

ఒక్కొక్క‌రి వ‌ద్ద రెండు, మూడేసి సిమ్ కార్డులు

సాధార‌ణంగా అన్నిర‌కాల ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో క‌నీసం రెండు సిమ్ కార్డులు ఉంటాయి. వాటికితోడు ట్యాబ్‌లు, ఇత‌ర ప‌రిక‌రాలు స‌రేస‌రి. వాటిలోనూ సిమ్ కార్డులు వేసుకోవ‌చ్చు. ఇలా ఒక కుటుంబంలో న‌లుగురు స‌భ్యులుంటే స‌గ‌టున 10 సిమ్ కార్డులు, ప‌ది నంబ‌ర్లు వాళ్ల ద‌గ్గ‌రే ఉంటున్నాయి. దీనివ‌ల్ల మొత్తం జ‌నాభా కంటే నంబ‌ర్లు, సిమ్ కార్డుల సంఖ్య పెరిగిపోతోంది. అదంతా బాగానే ఉంది. కానీ, నంబ‌ర్ల‌కు కూడా ఒక ప‌రిమితి అంటూ ఉంటుంది. ఇప్ప‌టికి మ‌న దేశంలో 6 సిరీస్ నుంచి 9 సిరీస్ వ‌ర‌కు మాత్ర‌మే నంబ‌ర్లు ఉన్నాయి. వీటిలో ముందు, వెన‌క చేసినా కూడా క్ర‌మంగా నంబ‌ర్లు అయిపోతున్నాయ‌న్న‌ది టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ (ట్రాయ్) తాజాగా చెబుతున్న విష‌యం. అందుకే ట్రాయ్ ఓ కొత్త ప్ర‌తిపాద‌న తీసుకొచ్చింది. మొబైల్ నంబ‌ర్ల‌కు కూడా ఛార్జీ పెట్టాల‌న్న‌ది ఆ ప్ర‌తిపాద‌న‌. అయితే, దాని మీద పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చెల‌రేగ‌డంతో.. కొద్దిగా మాట మార్చి, తూచ్ అంది. ఇప్ప‌టికి ఇంకా అలాంటి ఆలోచ‌న‌లు ఏవీ చేయ‌డం లేద‌ని, నంబ‌ర్ల విష‌యంలో నియంత్ర‌ణ‌కు ఏం చేయాలో ప్ర‌తిపాద‌న‌లు ఇవ్వాల్సిందిగా కోరాము త‌ప్ప‌, ఛార్జీలు విధించే ఆలోచ‌న ఏమీ లేద‌ని చెబుతోంది.

- Advertisement -

ఏం జ‌రుగుతోంది?
నిజానికి టెలికం వ్యాపారం అన్న‌ది మ‌న దేశంలో చాలా విస్తృతంగా వ్యాపించింది. తొలినాళ్ల‌లో ల్యాండ్ లైన్ ఫోన్లు మాత్ర‌మే ఉండేవి. అప్ప‌ట్లో ఆ ఫోన్ కావాల‌న్నా కూడా ఆరు నెల‌ల నుంచి ఏడాది వ‌ర‌కు వేచి చూడాల్సి వ‌చ్చేది. ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉందంటే అదో పెద్ద ల‌గ్జ‌రీగా భావించేవారు. ఆ త‌ర్వాత సెల్ ఫోన్లు వ‌చ్చిన కొత్త‌ల్లో కార్డ్ లెస్ టెలిఫోన్ ప‌రిమాణంలో సెల్ ఫోన్లు ఉండేవి. వాటికి ఔట్ గోయింగ్ నిమిషానికి 14 రూపాయ‌లు, ఇన్ క‌మింగ్ 7 రూపాయ‌లు.. ఇలా ఛార్జీలు ఉండేవి. హ్యాండ్ సెట్ ఖ‌రీదు కూడా చాలా ఎక్కువ‌గా ఉండ‌టంతో అత్యంత ధ‌న‌వంతులు మాత్ర‌మే వాటిని ఉప‌యోగించేవారు. క్ర‌మంగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల అనంత‌రం కొత్త కొత్త కంపెనీలు రంగంలోకి రావ‌డంతో పోటీ పెరిగి, ధ‌ర‌లు అదుపులోకి వ‌చ్చాయి. క్ర‌మంగా ఇన్ క‌మింగ్ పూర్తిగా ఉచితం అయ్యింది. ఔట్ గోయింగ్ కూడా ధ‌ర‌లు నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చాయి. 2016 త‌ర్వాతి నుంచి ఇంట‌ర్నెట్ విప్ల‌వం మొద‌లైంది. పాకెట్ ఇంట‌ర్నెట్ ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో ఎక్కువ‌మంది స్మార్ట్ ఫోన్లు ఉప‌యోగించ‌డం మొద‌లుపెట్టారు. జియో వ‌చ్చిన త‌ర్వాత అది మ‌రీ ఎక్కువైంది. దాదాపు ఏడాది పాటు జియో త‌న వినియోగ‌దారుల‌కు ఉచితంగా ఇంట‌ర్నెట్ ఇవ్వ‌డంతో వాడ‌కానికి యూజ‌ర్లు బాగా అల‌వాటు ప‌డ్డారు. అప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో పాటు.. ప్రైవేటు రంగంలో ఐడియా, ఎయిర్‌టెల్‌, ఎయిర్ సెల్‌, డొకోమో లాంటి కొన్ని కంపెనీలు మాత్ర‌మే ఉండేవి. వాటిలో కొన్ని అంత‌ర్థానం అయిపోయాయి. ఇప్పుడు ప్ర‌ధానంగా జియో, ఎయిర్‌టెల్ రాజ్య‌మేలుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ నామ‌మాత్రంగానే పోటీలో ఉంది. ప్రైవేటు సంస్థ‌లు ఇప్ప‌టికే 5జీ సేవ‌లు ప్రారంభించ‌గా, బీఎస్ఎన్ఎల్ ఇటీవ‌లే 4జీలోకి ప్ర‌వేశించింది.

కొర‌త ఎందుకు వ‌చ్చింది?
అప్ప‌టివ‌ర‌కు ప్ర‌తి యూజ‌ర్ ద‌గ్గ‌ర ఒక నంబ‌ర్ ఉండేది. జియో రంగప్ర‌వేశం చేసి, ఉచితంగా సిమ్ కార్డులు ఇవ్వ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాత త‌మ వ‌ద్ద ఉన్న నంబ‌రుకు అద‌నంగా మ‌రో జియో నంబ‌రు తీసుకోవ‌డం చాలామంది మొద‌లుపెట్టారు. దాంతో ఇంట‌ర్నెట్ వాడుకుంటూ, అంత‌కుముందున్న నంబ‌ర్‌ను కాల్స్, బ్యాంకు అనుసంధానానికి ఉప‌యోగించేవారు. ఇలా అందరి ద‌గ్గ‌ర నంబ‌ర్లు పెరిగిపోవ‌డం మొద‌లైంది. కానీ, ఎన్నినంబ‌ర్లు ఉన్నా, ప్ర‌ధానంగా ఒక నంబ‌రుకు మాత్ర‌మే కాల్స్, ఇంట‌ర్నెట్ కోసం రీఛార్జీ చేస్తుంటారు. మ‌రో నంబ‌రును మాత్రం కేవ‌లం బ‌తికించి ఉంచ‌డానికి ఏడాదికోసారి నామామ‌త్రంగా రీఛార్జి చేస్తారు. దానివ‌ల్ల ఆ నంబ‌రు నుంచి టెలికం కంపెనీల‌కు, త‌ద్వారా ట్రాయ్‌కి ఎలాంటి ఆదాయం రాదు. దీన్నే ఇన్‌కం ప‌ర్ యూజ‌ర్ (ఐపీయూ) అంటారు. మ‌న దేశంలో పేరుకు 120 కోట్ల మొబైల్ యూజ‌ర్లు ఉన్నారు. వారిలో 60 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులే. కానీ ఆ స్థాయిలో ఐపీయూ మాత్రం రావ‌డం లేదు. దానికితోడు క్ర‌మంగా నంబ‌ర్లు అయిపోవ‌డం మొద‌లైంది. అప్పుడే ఈ నంబ‌ర్ల వాడ‌కాన్ని నియంత్రించాల‌న్న ఆలోచ‌న ట్రాయ్‌కి వ‌చ్చింది.

11 నంబ‌ర్ల సిరీస్ ఉండ‌కూడ‌దా?
ప్ర‌స్తుతం మ‌న దేశంలో 10 నంబ‌ర్ల సిరీస్ మాత్ర‌మే మొబైల్ నంబ‌ర్ల‌కు ఉప‌యోగిస్తున్నారు. ఇందులో 6 నుంచి 9 వ‌ర‌కు అంకెల‌తో మొద‌ల‌య్యేవి ఉన్నాయి. వీటిని 11 అంకెల‌కు పెంచాల‌న్న ఆలోచ‌న కూడా ట్రాయ్ వ‌ద్ద ఉంది. ఇప్పుడున్న నంబ‌ర్ల‌కు ముందు అద‌నంగా మ‌రో 9 చేర్చ‌డం వ‌ల్ల కొత్త‌గా దాదాపు వెయ్యి కోట్ల నంబ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి. అయితే, మొత్తం సామ‌ర్థ్యంలో 70% మాత్ర‌మే క‌నెక్ష‌న్లు జారీచేయాల‌న్న నిబంధ‌న ప్ర‌కారం చూసుకున్నా దాదాపు 700 కోట్ల కొత్త క‌నెక్ష‌న్లు మ‌న భార‌త‌దేశంలోనే ఇచ్చుకోవ‌చ్చు. అలా చేస్తే ప్ర‌స్తుతం ఎదుర‌వుతున్న నంబ‌ర్ల కొర‌త కొంత‌వ‌ర‌కు ప‌రిష్కారం అవుతుంది. అలాగే ల్యాండ్ లైన్ నంబ‌ర్ల నుంచి ఫోన్ చేసేట‌ట్ల‌యితే ముందు 0 అనే నంబ‌రును చేర్చాల‌ని కూడా ట్రాయ్ భావిస్తోంది. అంతేకాదు.. ఇప్ప‌టివ‌ర‌కు 6 నుంచే మొద‌ల‌య్యే మొబైల్‌ ఫోన్ నంబ‌ర్ల‌ను 2, 3, 4, 5 అంకెల‌తో కూడా మొద‌లుపెట్ట‌చ్చు. దానివ‌ల్ల కూడా అద‌నంగా మ‌రిన్ని నంబ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి. ఇలాంటి ప‌లు ర‌కాల ఆప్ష‌న్ల‌ను ట్రాయ్ ప‌రిశీలిస్తోంది.

ఆదాయం మాటేమిటి?
నిజానికి ఎన్ని నంబ‌ర్లు అందుబాటులోకి తెచ్చామ‌న్న‌దాని కంటే, ఒక్కో యూజ‌ర్ నుంచి ఎంత ఆదాయం వ‌స్తోంద‌న్న‌దే అటు ట్రాయ్ గానీ, ఇటు టెలికం కంపెనీలు గానీ చూస్తాయి. అందువ‌ల్ల మొత్తం 134 కోట్ల జ‌నాభా ఉన్న భార‌త‌దేశంలో పిల్ల‌ల‌ను, వృద్ధుల‌ను వ‌దిలేస్తే మిగిలిన సుమారు 100 కోట్ల మంది వ‌ద్ద మొబైల్ ఫోన్లు ఉంటే స‌రిపోతుంది. అన్ని నంబ‌ర్ల నుంచి మాత్ర‌మే ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన మొత్తంలో ఆదాయం వ‌స్తుంది. అలా కాకుండా విచ్చ‌ల‌విడిగా నంబ‌ర్లు పెంచుకుంటూ పోవ‌డం వ‌ల్ల ఇంత‌కుముందు చెప్పుకున్న‌ట్లే ఒక‌టికి మూడు, నాలుగు నంబ‌ర్లు పెట్టుకుని, వాటిలో ఒక్క‌దానికే రీఛార్జి చేయించేవారి వ‌ల్ల కంపెనీల‌కు ఎలాంటి ఉప‌యోగం ఉండ‌దు. అలాంట‌ప్పుడు క్ర‌మంగా నియంత్ర‌ణ అనే ఆలోచ‌న వారి మ‌దిలోకి వ‌స్తుంది. అప్పుడు క‌నీసం నంబ‌రును బ‌తికించి ఉంచాల‌న్నా కూడా ఏడాదికి త‌ప్ప‌నిస‌రిగా ఇంత క‌ట్టాల‌న్న నిబంధ‌న‌ను తీసుకొచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. అందువ‌ల్ల అవ‌స‌రానికి మించి మొబైల్ నంబ‌ర్లు.. అంటే సిమ్ కార్డులు ఉంచుకోవ‌డం దండ‌గ‌.

(తెలుగుప్ర‌భ ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News