ఈ రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. ఆధార్ లేకుండా ఏ పని అయినా జరగడం చాలా కష్టం. సిమ్ కార్డు తీసుకోవడం, టికెట్లు బుక్ చేయడం, లేదా ఇతర అనేక కార్యాలయ సేవలు ఉపయోగించుకోవడం అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. అందువల్ల, ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎప్పుడూ దగ్గరగా ఉండాల్సిందే.
ఆధార్ కార్డులో కొన్ని వివరాలను ఎన్ని సార్లు అప్‌డేట్ చేయవచ్చు అనేది చాలా మంది తెలియదు. కొన్ని వివరాలు అనేక సార్లు మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని వివరాలు ఒక సారి మాత్రమే అప్‌డేట్ చేయవచ్చు. ఉదాహరణకు, ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎక్కువ సార్లు మార్చలేం. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే మార్పు చేసుకోవచ్చు. పుట్టిన తేదీని మారుస్తున్నప్పుడు, మీరు యూఐడీఏఐ చట్టం ప్రకారం సరిగా ధృవీకరించిన రుజువుతో ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి.
ఆధార్ కార్డులో పేరు మార్పును ఒకసారి మాత్రమే చేయవచ్చు. అయితే, సరైన కారణం ఉంటే మినహాయింపులు ఉంటాయి. ఫొటోను మాత్రం ఆధార్ ఎన్‌రోల్ సెంటర్‌లో ఎన్ని సార్లు అయినా మార్చుకోవచ్చు. అలాగే, ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు పరిమితి లేకుండా చేయవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేసి, మీరు అడ్రస్ మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డులో జెండర్‌ను కూడా ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేయవచ్చు. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే, జెండర్ మార్పును మరోసారి అప్‌డేట్ చేయవచ్చు. ఈ మార్పుల కోసం కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్స్ అవసరం. పాస్‌పోర్ట్, ప్రభుత్వ ఫోటో ఐడెంటిటీ కార్డు, బర్త్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లు ఇవి మార్పులు చేయడానికి ఉపయోగపడతాయి. ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేయడానికి ముందు, స్థానిక ఆధార్ కేంద్రానికి వెళ్లి సమర్పించాల్సిన వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.