Security Guard to Software Engineer: మంచి కంపెనీలో కొలువు కొట్టాలంటే డిగ్రీ సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ ఈ స్టోరీ చదివితే మాత్రం మీ అంచనా తప్పు అవుతుంది. పెద్దగా చదువుకోలేదు. చేతిలో డిగ్రీ పట్టా లేదు. కుటుంబ పోషణ కోసం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు.. కట్ చేస్తే ఇప్పుడు అదే కంపెనీలో మంచి హోదాతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అదెలా సాధ్యమనుకుంటారా.. అబ్దుల్ అలీం స్టోరీ తెలుసుకోవాల్సిందే..
సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాలంటే ముందుగా చేతిలో డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత అందుకు సంబంధించిన స్కిల్స్ కలిగి ఉండాలి. కానీ ప్రముఖ టెక్నాలజీ సంస్థ ZOHO కంపెనీ అతని చేతిలో డిగ్రీ పట్టా చూడలేదు. ఆ వ్యక్తిలోని టాలెంట్‌ను మాత్రమే చూసింది. చేసేది సెక్యూరిటీ గార్డు ఉద్యోగమే అయినా కోడింగ్‌లో అతనికున్న నైపుణ్యం చూసి గేటు దగ్గర ఉన్న అతడిని లోపలికి ఆహ్వానించింది. డిగ్రీలు, సర్టిఫికెట్ల కంటే వ్యక్తిలోని నిజమైన నైపుణ్యానికే విలువ ఇవ్వాలనే సూత్రాన్ని జోహో మరోసారి నిరూపించింది.
Also Read: https://teluguprabha.net/business/postal-insurance-scheme-benefits/
మంచి పొజిషన్‌లో ఉండాలని
అస్సాం రాష్ట్రానికి చెందిన అబ్దుల్ అలీం ఒకప్పుడు జోహో కంపెనీ ఆవరణలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించేవాడు. ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందని అలీం.. తన జీవితాన్ని మార్చుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులను చూసి తాను కూడా వారిలా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నాడు. కోడింగ్ నేర్చుకుంటే జీవితం బాగుంటుందని భావించాడు. ఇందుకోసం తన ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయలేదు.
విధులు ముగిశాక
అబ్దుల్ తన పని వేళలు ముగిశాక కోడింగ్ నేర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తూ.. పుస్తకాలు చదువుతూనే సొంతంగా కోడింగ్‌పై పట్టు సాధించాడు. రాత్రుళ్లు తక్కువగా నిద్రపోతూ.. ఎక్కువ సమయాన్ని కోడింగ్ నేర్చుకోవడం కోసం కేటాయించాడు. ఈ క్రమంలో తను నేర్చుకున్న స్కిల్స్‌తో సొంతంగా ఒక అప్లికేషన్‌ను కూడా తయారుచేశాడు.
Once a security guard, now a software engineer at the same company. 💪🔥
Abdul Alim from Assam worked as a security guard at @Zoho learned coding after shifts, built an app, and earned an engineer role.
Kudos to Zoho for valuing skills over degrees and giving true talent a… pic.twitter.com/5Zt9UBZYQo
— Joseph Kulavi💡 (@AttomLegend) October 9, 2025
అనంతరం అబ్దుల్ అలీం తాను రూపొందించిన అప్లికేషన్, కోడింగ్ స్కిల్స్‌ను జోహో కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కంపెనీ యాజమాన్యం అతడి ప్రతిభను, అంకితభావాన్ని చూసి ఆశ్చర్యానికి గురైంది. వెంటనే అతడిని ఉద్యోగంలోకి తీసుకుంటూ అపాయింట్‌మెంట్ లెటర్‌ను ఇచ్చింది.
Also Read: https://teluguprabha.net/gallery/amazing-health-benefits-of-eating-blueberries/
నెట్టింట ప్రశంసలు
ఇందుకోసం జోహో అబ్దుల్ స్టడీ సర్టిఫికెట్స్‌ను కూడా అడగలేదు. నిజమైన టాలెంట్‌కు విలువిస్తూ అతడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పదోన్నతి కల్పించింది. దీంతో అబ్దుల్ అలీంకు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సర్టిఫికెట్స్ చూడకుండా టాలెంట్‌ను గుర్తించి ఉద్యోగమిచ్చిన జోహోకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

