ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ (Airtel) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం 10 నిమిషాల్లోనే సిమ్ కార్డును(Sim Card Delivery) యూజర్లకు అందించేందుకు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌తో (Blinkit) జట్టుకట్టింది. తొలి దశలో హైదరాబాద్, ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, లక్నో, కోల్‌కతా వంటి 16 ప్రధాన నగరాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం దశలవారీగా మిగిలిన నగరాలు, పట్టణాలకు ఈ సేవలను విస్తరించనున్నామని తెలిపింది.
కేవలం రూ.49 రుసుము చెల్లించి సిమ్ కార్డు పొందొచ్చని వెల్లడించింది. సిమ్ కార్డు డెలివరీ అయిన తర్వాత ఆధార్ కేవైసీ సాయంతో సిమ్‌కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి రావాలనుకునే వారు సైతం ఈ సేవలను వినియోగించుకోవచ్చు. సిమ్ కార్డు డెలివరీ అయిన 15 రోజుల్లో యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.