Apple Headsets, Smart Glasses: టెక్ దిగ్గజం ఆపిల్ టెక్నాలజీలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ, అన్నింటి కంటే ముందు వరుసలో ఉంటోంది. తాజాగా ఈ కంపెనీ భవిష్యత్తుకు సంబంధించిన తన హెడ్-మౌంటెడ్ డివైజ్‌లు, స్మార్ట్ గ్లాసెస్ ప్రణాళికలను నిశ్శబ్దంగా సిద్ధం చేస్తోంది. ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కువో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, యాపిల్ 2025 నుంచి 2028 వరకు అనేక ధరించగలిగే పరికరాలను విడుదల చేయనుంది.
వచ్చే మూడేళ్లలో ఆవిష్కరణలు ఇవే..
2025 మూడవ త్రైమాసికంలో, ఆపిల్ M5 చిప్‌తో Vision Pro హెడ్‌సెట్‌ను విడుదల చేయనుంది. ఇది ప్రస్తుతం ఉన్న M2 చిప్‌ను బదిలీ చేస్తూ, మరింత శక్తివంతమైన పనితీరును అందించనుంది. అయితే స్పెసిఫికేషన్‌లలో పెద్దగా మార్పులు ఉండకపోయినా, ఇది యాపిల్ XR ఎకోసిస్టమ్‌కు మరో మెట్టు చేర్చనుంది. షిప్‌మెంట్లు 150,000 నుండి 200,000 యూనిట్ల మధ్య ఉండే అవకాశం ఉంది.
మరో రెండేళ్లలో ఆపిల్ తక్కువ బరవుతో Vision Air ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది Vision Pro కంటే 40% తక్కువ బరువుతో ఉండబోతుంది. గ్లాస్ స్థానంలో ప్లాస్టిక్, మెగ్నీషియం అల్లాయ్ వాడకంతో బరువు తగ్గించబడుతుంది. ప్రాసెసింగ్ కోసం ఐఫోన్ ఫ్లాగ్‌షిప్ చిప్ వాడనుంది. ఇది ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడానికి రూపొందించిన ఉత్పత్తి.
2028 రెండవ భాగంలో యాపిల్ పునర్ డిజైన్ చేసిన రెండవ తరం Vision Proని విడుదల చేయనుంది. ఇది Mac గ్రేడ్ చిప్‌తో కూడి, తక్కువ ధర, తక్కువ బరువుతో ఉంటుందని అంచనా. దీని ద్వారా ప్రీమియం XR వినియోగదారులను మరింత ఆకర్షించాలని యాపిల్ భావిస్తోంది.
స్మార్ట్ గ్లాసెస్
2027లో డిస్‌ప్లే లేకుండా కానీ ఆడియో, కెమెరా, AI ఫీచర్లతో గ్లాసెస్‌ను ఆపిల్ విడుదల చేయనుంది. జెస్చర్ కంట్రోల్, వాయిస్ కమాండ్, స్మార్ట్ సెన్సింగ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. మొదటి ఏడాది 3–5 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్ జరగవచ్చని అంచనా. ఇది TWS, స్మార్ట్‌ఫోన్ కెమెరాలకు ప్రత్యామ్నాయంగా నిలవగలదు.
2028లో రంగు డిస్‌ప్లే మరియు వేవ్‌గైడ్ టెక్నాలజీ ఆధారంగా అధునాతన XR గ్లాసెస్ మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ గ్లాసెస్‌లో ముఖ్యంగా AI డీప్ ఇంటిగ్రేషన్ ఉండే అవకాశం ఉంది. ఇది రియాలిటీతో ఇంటెరాక్షన్‌ను మరింత సహజంగా మార్చనుంది.
సాఫ్ట్‌వేర్ ఆపిల్ ఇంటెలిజెన్స్
ఆపిల్ హార్డ్‌వేర్‌లో గొప్పదే అయినా, ధరించగలిగే పరికరాల సఫలతకు శక్తివంతమైన AI ఆపరేటింగ్ సిస్టమ్ అవసరమవుతుంది. “Apple Intelligence” పేరిట యాపిల్ అభివృద్ధి చేస్తున్న సాఫ్ట్‌వేర్‌కి ఇంకా చాలా దారిలో ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ 2027–2028 గ్లాసెస్ కోసం సిద్ధమవుతుందా? అనేేది తెలియాల్సి ఉంది.
ఆపిల్ ధరించగలిగే టెక్నాలజీ మార్కెట్‌లో బహుముఖ వ్యూహంతో అడుగులేస్తోంది. Vision Series ద్వారా ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తే, Smart Glassesతో మాస్ మార్కెట్‌ను ఆకర్షించాలనుకుంటోంది. దీనిని స్మార్ట్‌ఫోన్ తర్వాతి టెక్ విప్లవంగా భావిస్తున్నారు.