Sunday, February 23, 2025
Homeటెక్ ప్లస్Bio Asia: బయో ఏషియా 2025

Bio Asia: బయో ఏషియా 2025

స్టార్టప్పులో జోష్

ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్ లో బయో ఏషియా సదస్సు జరుగనుంది. ఆసియాలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ సదస్సుగా బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో వరుసగా రెండు రోజుల పాటు 22వ ఎడిషన్ సదస్సుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

దాదాపు 50 దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సంబంధిత రంగాల్లో నిపుణులు, ఆవిష్కర్తలు ఈ వేదికపై జరిగే చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, శాస్త్ర పురోగతిని ఈ సదస్సులో చర్చిస్తారు.

ఈసారి థీమ్ ఇదే

ఈసారి బయో ఏషియా సదస్సుకు ‘క్యాటలిస్ట్ ఆఫ్ ఛేంజ్, ఎక్స్​పాండింగ్​ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్’ (మార్పు సాధిద్ధాం.. ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం..) అనే థీమ్ ను ఎంచుకున్నారు. హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితర అంశాలను ఎజెండా అంశాలుగా నిర్ణయించారు. కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల సహకారాలు, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

ఇన్నోవేషన్ హబ్ గా మన సిటీ

బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై ఈ సదస్సు చర్తిస్తుంది. ఆయా రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు ఔత్సాహిక సంస్థలు, నిపుణులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచస్థాయిలో హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైద్య పరిశోధనలు, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఎక్సలెన్స్‌లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బయో ఏసియా 2025 సదస్సు లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలువనుంది. పరిశ్రమల వృద్ధి, సహకారం, అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు బయో ఏషియా సదస్సు సరికొత్త మార్గదర్శనం అందించనుంది.

లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు గమ్యంగా..

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఎల్లుండి (25 వ తేదీన) ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, క్వీన్స్‌ ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జీనెట్ యంగ్, జి20 షెర్పా అమితాబ్ కాంత్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బయో ఏషియా ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు. సదస్సులో భాగంగా ఈసారి ప్రపంచ దిగ్గజ కంపెనీలు, పేరొందిన సంస్థలకు చెందిన సీఈవోల కాంక్లేవ్ ఏర్పాటు చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలు, సవాళ్లను ఇందులో చర్చిస్తారు.

పాల్గొననున్న అతిరథ మహారథులు

ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్.సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా, నోవార్టిస్ ఏషియా పసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ కాంక్లేవ్ లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అమ్జెన్ ఛైర్మన్, సీఈవో రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే, జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్ మిల్టెనీ బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ స్టోఫెల్ తదితర ప్రముఖులు సదస్సులో జరిగే చర్చల్లో పాలుపంచుకుంటారు.

ప్రభావవంతమైన సదస్సుగా

హైదరాబాద్ లో జరిగే బయో ఏషియా సదస్సు చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సదస్సుగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, ఆలోచనలన్నీ ఒకే వేదికపై పంచుకునే అరుదైన అవకాశాన్ని బయో ఏషియా అందిస్తుందన్నారు. బయో ఏషియా సదస్సుకు కొత్త సార్టప్ ల నుంచి అంచనాలకు మించిన స్పందన వచ్చిందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. పేరొందిన కంపెనీలు, ప్రముఖ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యం పంచుకోవటం ఉత్సాహంగా ఉందని అన్నారు.

ల్యాండ్ మార్క్ ఎడిషన్ గా

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందని బయో ఏషియా 2025 సీఈవో, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తెలిపారు. ఈసారి సదస్సు ల్యాండ్ మార్క్ ఎడిషన్​గా ఉండబోతుందని అన్నారు. బయో ఏషియా 2025లో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ను ఏర్పాటు చేశారు. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో రూపొందించిన దాదాపు 700 స్టార్టప్ లు దీనికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ఎంపిక చేసిన 80 స్టార్టప్‌లను ఈ సదస్సులో ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు.

‘ఇన్నోవేషన్ జోన్’లో వీటిని ప్రదర్శిస్తారు. హెల్త్ కేర్ రంగంలో మెడికల్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఎంపిక చేశారు. కొత్త స్టార్టప్లకు ప్రపంచ స్థాయి గుర్తింపుతో పాటు, అద్భుతమైన అవకాశాలను ఈ సదస్సు అందించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News