Saturday, October 26, 2024
Homeటెక్ ప్లస్BSNL: భారీగా పెరిగిన బీఆఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రైబర్లు సంఖ్య

BSNL: భారీగా పెరిగిన బీఆఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రైబర్లు సంఖ్య

BSNL| కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(BSNL)కు ఎట్టకేలకు మంచిరోజులు వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడలేక వ్యాపారం పరంగా బాగా వెనక్కి పడిపోయింది. అయితే గత కొన్ని నెలలుగా కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచడంతో పెద్ద సంఖ్యలో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారు. టెలికాం రెగ్యులేటర్ ట్రైయి తాజా డేటా ప్రకారం.. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ బేస్ గత రెండు నెలల్లో వేగంగా పెరిగింది. తక్కువ టారిఫ్‌లు ఉండటమే కాకుండా 4జీ సేవల ‘సాఫ్ట్ లాంచ్’ కూడా ఇందుకు దోహదపడ్డాయి.

- Advertisement -

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా అన్ని ఇతర కంపెనీల వినియోగదారుల సంఖ్య క్షీణించింది. అయితే ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు పెరగడం విశేషం. జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఎయిర్‌టెల్ 17 లక్షల మంది, వోడా ఐడియా 14 లక్షలు, జియో 8 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి. ఇక ఆగస్టు నెలలో కూడా వినియోగదారుల సంఖ్య పెరిగింది. ఈ నెలలో 25 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకోగా.. .జియో 40 లక్షలు, ఎయిర్‌టెల్ 24 లక్షలు, వోడా ఐడియా 19 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి.

మొత్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థకు కస్టమర్లు పెంచుకోవడం శుభపరిణామంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి, అయితే మార్కెట్‌ వాటా మాత్రం ప్రైవేట్ ప్రత్యర్థులతో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి జియో 40.5% మార్కెట్ వాటాతో ముందంజలో ఉండగా, ఎయిర్‌టెల్ 33%, వొడాఫోన్ ఐడియా 18% మార్కెట్ వాటాను కలిగి ఉంది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ వాటా 7.8%గా ఉందని ట్రాయ్ తెలిపింది.

ఇదే సమయంలో వేగవంతమైన 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల కంపెనీ లోగోను కూడా మార్చిన సంగతి తెలిసిందే. గతంలో వృత్తాకారంలోని ఊదా రంగు లోగోపై నీలం, ఎరుపు వర్ణంలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ చిహ్నాలు ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారత చిత్రపటాన్ని ఉంచి దానిపై తెలుపు, ఆకుపచ్చ వర్ణంలో కనెక్టివిటీ సింబల్స్‌ను ఉంచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News