Bsnl Recharge Plan Know Details And Benefits: ప్రభుత్వ రంగ టెలికా సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) రోజురోజుకూ కొత్త ఆఫర్లు ప్రకటిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఉన్న యూజర్లను కోల్పోకుండా.. కొత్త కస్టమర్లను ఆకట్టుకునేలా ఆఫర్లు ప్రవేశపెడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా 60 ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల కోసం ఓ వినూత్న ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ను “బీఎస్‌ఎన్‌ఎల్ సమ్మాన్ ప్లాన్’ అనే పేరుతో ప్రవేశపెట్టింది. వృద్ధులకు టెలికాం సేవలను మరింత చేరువ చేయాలని, కమ్యూనికేషన్ సౌకర్యాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ నూతన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ ప్లాన్‌ను నూతన యూజర్ల కోసం పరిమిత కాల ఆఫర్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ కొత్త యూజర్లకు మాత్రమేనని బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
రూ.1812లకే ‘సమ్మాన్ ప్లాన్’
ఈ ప్లాన్ కింద ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు వ్యాలిడిటీ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు 365 రోజులు అన్‌లిమిటెడ్ ఉచిత కాల్స్‌ను అందిస్తుంది. దీని వలన వృద్ధులు తరచూ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. దేశవ్యాప్తంగా (స్థానిక, ఎస్‌టిడి, రోమింగ్) ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. యూజర్లు రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbpsకు పడిపోతుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ తీసుకునే సీనియర్ సిటిజన్‌లకు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి) ఉచిత సిమ్ కార్డ్ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద ఆరు నెలల పాటు BiTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ పరిమిత కాలపు ఆఫర్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ప్లాన్‌ను ఇలా తీసుకోండి..
బీఎస్‌ఎన్‌ఎల్ సమ్మాన్ ప్లాన్ ప్రస్తుతం 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కొత్త సీనియర్ సిటిజన్ కస్టమర్ల కోసం ప్రమోషనల్ ఆఫర్‌గా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పొందేందుకు గానూ దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ స్టోర్ లేదా అధీకృత డీలర్‌ను సంప్రదించాలని యూజర్లను కోరింది. వయస్సు నిర్థారణ కొరకు వృద్ధులు తమ ఆధార్ కార్డ్‌ను సబ్‌మిట చేయాలి. అనంతరం, కొత్త కనెక్షన్ తీసుకుని, రూ. 1812 చెల్లించి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వృద్ధులకు తక్కువ ఖర్చుతో, ఎక్కువ కాలం పాటు అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. వృద్దుల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడానికి బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన వినూత్న ప్రయోగంగా దీన్ని చెప్పవచ్చు. ఇది పరిమిత కాలపు ఆఫర్ కాబట్టి, ఆసక్తి ఉన్న సీనియర్ సిటిజన్లు వెంటనే ప్లాన్ తీసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ కోరింది.


