BSNL| కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BSNL టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తక్కువ టారిఫ్ ధరలకే క్వాలిటీ సేవలు అందించేందుకు కసరత్తులు ప్రారంభించిన ఈ సంస్థ మరో సంచలన ప్రకటన చేసింది.
ఇకపై ‘సిమ్’ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు చేసేలా కొత్త టెక్నాలజీని తయారుచేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త టెక్నాలజీతో ఫోన్‌లో సిమ్, నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్నా, అటవీ ప్రాంతంలో తప్పిపోయినా శాటిలైట్ సాయంతో ఈ సేవలు పొందవచ్చని పేర్కొంది. డైరెక్ట్ టూ డివేజ్ టెక్నాలజీ కోసం అమెరికాకు చెందిన వయాశాత్ తో కలిసి దీనిని పరీక్షిస్తున్నట్లు తెలిపింది. శాటిలైట్, ప్రాంతీయ మొబైల్ నెట్‌వర్క్‌లను లింక్ చేయడం ద్వారా ఇది పనిచేయనుందని చెప్పింది. దీంతో శాటిలైట్లే సెల్‌ఫోన్ టవర్లు అవుతాయంది.
కాగా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా 50వేల కొత్త 4జీ టవర్లను వేస్తున్నట్లు ఇటీవల BSNL ప్రకటించింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు టారిఫ్ ఛార్జీలు పెంచడంతో రెండు నెలల వ్యవధిలోనే లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లో చేరారు. జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఎయిర్‌టెల్ 17 లక్షల మంది, వోడా ఐడియా 14 లక్షలు, జియో 8 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి. ఇక ఆగస్టు నెలలో కూడా వినియోగదారుల సంఖ్య పెరిగింది. ఈ నెలలో 25 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకోగా.. జియో 40 లక్షలు, ఎయిర్‌టెల్ 24 లక్షలు, వోడా ఐడియా 19 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి.
మొత్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థకు కస్టమర్లు పెంచుకోవడం శుభపరిణామంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి, అయితే మార్కెట్ వాటా మాత్రం ప్రైవేట్ ప్రత్యర్థులతో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి జియో 40.5% మార్కెట్ వాటాతో ముందంజలో ఉండగా, ఎయిర్‌టెల్ 33%, వొడాఫోన్ ఐడియా 18% మార్కెట్ వాటాను కలిగి ఉంది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ వాటా 7.8%గా ఉందని ట్రాయ్ తెలిపింది.