Saturday, November 15, 2025
Homeటెక్నాలజీCyber Alert: లింకుతో లిప్తకాలంలో లూటీ - ఖాతా ఖాళీ అవ్వకుండా.. జర జాగ్రత్త!

Cyber Alert: లింకుతో లిప్తకాలంలో లూటీ – ఖాతా ఖాళీ అవ్వకుండా.. జర జాగ్రత్త!

How to protect  smartphone from cyber attack : “మీ విద్యుత్ బిల్లు కట్టలేదు, వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి చెల్లించండి.” ఇలాంటి సందేశం మీకు వచ్చిందా? అయితే ఒక్క క్షణం ఆగండి! పూటకో వేషం, రోజుకో మోసం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులమంటూ, బ్యాంకు సిబ్బందిగా నటిస్తూ ఏపీకే ఫైల్స్, వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ వంటి అధునాతన పద్ధతులతో మన ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అసలు ఈ ఏపీకే ఫైల్స్ అంటే ఏమిటి..? వాట్సాప్ స్క్రీన్ షేరింగ్‌తో డబ్బులు ఎలా దోచేస్తున్నారు…? ఈ సైబర్ మాయగాళ్ల వలలో చిక్కకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..?

- Advertisement -

సాంకేతికతను ఆయుధంగా మార్చుకున్న సైబర్ కేటుగాళ్లు, సామాన్య ప్రజల సొమ్మును కొల్లగొట్టేందుకు పౌరసేవలను సైతం వాడుకుంటున్నారు. విద్యుత్ బిల్లులు, ట్రాఫిక్ చలానాల పేరుతో స్మార్ట్‌ఫోన్లకు మాల్‌వేర్ (హానికరమైన సాఫ్ట్‌వేర్) ఉన్న లింకులను పంపి, మన ఫోన్‌ను వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత మనకు తెలియకుండానే బ్యాంకు, యూపీఐ ఖాతాల్లోని నగదును మాయం చేస్తున్నారు.

మోసం చేసే విధానం ఇదిగో.. (ఏపీకే ఫైల్స్ తో) :
అధికారుల అవతారం: సైబర్ నేరగాళ్లు ముందుగా ప్రభుత్వ శాఖల అధికారులుగానో, బ్యాంకు సిబ్బందిగానో నటిస్తూ మీకు ఫోన్ చేస్తారు. నమ్మశక్యంగా మాట్లాడి మిమ్మల్ని ముగ్గులోకి లాగుతారు.

యాప్ డౌన్‌లోడ్: ఏదో ఒక సమస్య చెప్పి, దాన్ని పరిష్కరించాలంటే తాము పంపిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలంటూ ఆండ్రాయిడ్ ప్యాకేజ్‌ కిట్‌ (APK) ఫైల్‌ను పంపుతారు.

ఫోన్ హ్యాక్: మీరు ఆ లింక్‌పై క్లిక్ చేసి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగానే, మీ ఫోన్ నియంత్రణ వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు మీకు తెలియకుండానే ఈ యాప్ ఇన్‌స్టాల్ అయిపోతుంది.

ఓటీపీతో దోపిడీ: ఫోన్‌ను హ్యాక్ చేశాక, లావాదేవీలు జరిపి, మీకు వచ్చే ఓటీపీలను మాయమాటలతో చెప్పించుకుంటారు. లేదా మీ ఫోన్ నుంచే నేరుగా తెలుసుకుని ఖాతాలోని సొమ్ము మొత్తం కాజేసి, ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తారు.

డబ్బు మాయం: బాధితులు ఫిర్యాదు చేసేలోపే ఆ నగదును వేరే దేశంలో క్రిప్టో కరెన్సీగా మార్చేసి, దొరక్కుండా తప్పించుకుంటారు. డార్క్‌ వెబ్, టెలిగ్రామ్, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఈ ఏపీకే ఫైల్స్ లింకులు వ్యాప్తి చెందుతున్నాయని సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత దార తెలిపారు.

స్క్రీన్ షేరింగ్‌తో ఖాతా ఖాళీ : వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘స్క్రీన్ షేరింగ్’ ఫీచర్ సైబర్ నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారింది. బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకుని, మీ ఖాతాకు ఏదో సమస్య ఉందని నమ్మిస్తారు. సమస్యను పరిష్కరించేందుకు వాట్సాప్ వీడియో కాల్ చేసి, ‘స్క్రీన్ షేర్’ చేయమని ఒత్తిడి తెస్తారు. మీరు స్క్రీన్ షేర్ చేయగానే, మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపించే ప్రతిదీ వారికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వారు మీ ఫోన్ నుంచే బ్యాంకింగ్ యాప్‌ను ఓపెన్ చేయించి, మీరు మీ పాస్‌వర్డ్ లేదా ఓటీపీని ఎంటర్ చేస్తుండగా దాన్ని చూసి, వెంటనే డబ్బును వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ ఫోన్‌లో, వాట్సాప్‌లో అనుమతి లేకుండా ఏ యాప్ ఇన్‌స్టాల్ కాకుండా ఉండేందుకు రెండంచెల భద్రతను (Two-Step Verification) తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి.
అధికారిక స్టోర్లనే వాడండి: ఏ యాప్‌ను అయినా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సాప్‌లో వచ్చే లింకుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దు.

తెలియని సోర్స్‌లను బ్లాక్ చేయండి: మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో ‘Installations from Unknown Sources’ ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోండి.
స్పెల్లింగ్ చెక్ చేయండి: ప్రభుత్వ, బ్యాంకు వెబ్‌సైట్ల పేర్లలోని అక్షరాలను క్షుణ్నంగా గమనించండి. నేరగాళ్లు చిన్న చిన్న అక్షర దోషాలతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తారు.
బెదిరింపులకు లొంగవద్దు: బిల్లులు, చలానాలు కట్టినా జమ కాలేదని ఎవరైనా బెదిరిస్తే నమ్మవద్దు. నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి నిర్ధారించుకోండి.
స్క్రీన్ షేర్ చేయవద్దు: ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో మీ ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేయవద్దు.

వర్చువల్ కీబోర్డ్: బ్యాంకింగ్ లావాదేవీలకు చాలా వెబ్‌సైట్లు అందించే వర్చువల్ కీబోర్డును ఉపయోగించడం సురక్షితం. ఒకవేళ మీరు మోసపోయినట్లు గుర్తిస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad