ఇప్పటి పిల్లల్లో డిజిటల్ ఎడిక్షన్ బాగా పెరిగింది. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ అనుక్షణం ఫోన్లను పట్టుకుని కూర్చుంటున్నారు. వాటిల్లోనే ఆటలు కూడా ఆడుతున్నారు. తమ పనులు సాఫీగా సాగిపోవడానికి తల్లిదండ్రులు కూడా పిల్లల చేతుల్లో ఫోన్లు, ఐపాడ్ లు ఇష్టంవచ్చినట్టు పెడుతున్నారు. పిల్లల చేతుల్లో సెల్స్, ఐపాడ్స్ వంటి టెక్నికల్ గాడ్జెట్స్ పెట్టేటప్పుడు తల్లిదండ్రులు విచక్షణతో వ్యవహరించాలి. టెక్నాలజీ వినియోగం పిల్లల్లో మంచి అలవాట్లను పెంచేలా ఉండాలి తప్ప గంటల కొద్దీ వాటితో ఆడుతూ వాటికి వాళ్లు బానిసలయ్యేట్టు చేయకూడదు. స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడడం కూడా చిన్నారులకు మంచిది కాదు.
గంటల కొద్దీ స్క్రీన్ కు అతుక్కుపోతే వారి శరీరానికి వ్యాయామం ఉండదు. ఫలితంగా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసిక సమస్యలు కూడా పిల్లల్లో పెరుగుతాయి. వారి ఎమోషనల్ ఆరోగ్యం దెబ్బతింటుంది. సమాజంతో, తోటి పిల్లలతో సంబంధాలు లేకుండా ఒంటరిగా పెరుగుతారు. అలాగే పెద్దవారవుతారు. ఇది వారి వ్యక్తిత్వ రూపకల్పనలో సైతం తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లల్లో మంచి అలవాట్లు పెరిగేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. అలాగే టెక్నాలజీతో చిన్నారుల అనుబంధం బ్యాలెన్సింగ్ గా ఉండాలే తప్ప అది వారికి ఒక వ్యసనంగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. పిల్లల్లో హెల్దీ టెక్నాలజీ అలవాట్లను పెంపొందించడానికి తల్లిదండ్రులు వెరైటీ వ్యూహాలను చేపట్టాలి. పిల్లల్ని డిజిటల్ అడిక్షన్ నుంచి బయటపడేసి ఆరోగ్యంగా తీర్చిదిద్దాలంటే సెల్, ఐపాడ్ స్క్రీన్ల పై పిల్లలు గడిపే సమయాన్ని నియంత్రించాలి.
వారానికి లేదా రోజుకు స్క్రీన్ ఇన్ని గంటల మాత్రమే చూడాలనే పరిమితి విధించి ఆ సమయం మేర పిల్లలను అమ్మానాన్నలు అనుమతించాలి. అన్నం తినేటప్పుడు గాని, నిద్రపోవడానికి ముందు గానీ టెక్నికల్ గాడ్జెట్లను పిల్లల చేతుల్లో అస్సలు పెట్టొద్దు. నిర్దిష్టమైన గంటలు మాత్రమే పిల్లలను స్క్రీన్ కు పరిమితం చేయడం వల్ల అంతర్జాలంలో ఇష్టంవచ్చిన కంటెంట్ చూసే అలవాటు పిల్లలకు అలవడదు. స్క్రీన్ పై పరిమిత గంటలు విధించేటప్పుడు పిల్లల వయసును కూడా పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. డిజిటల్ ఎడిక్షన్ వల్ల తలెత్తే దుష్పరిణామాలను చిన్నారులకు అర్థమయ్యేట్టు చెప్పాలి. ఎలాంటి విషయాలు చూడాలి, ఎలాంటివి చూడకూడదనే అంశాలను పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాలి. అప్పుడు టెక్నాలజీని ఎలా విచక్షణగా, సమతుల్యంగా వాడుకోవాలో చిన్నారులకు అర్థమవుతుంది.
ఇంట్లో బెడ్ రూమ్, డైనింగ్ రూముల్లో డిజిటల్ స్క్రీన్లు చూస్తూ గడపడానికి వీల్లేదని చిన్నారులకు స్పష్టంగా చెప్పాలి. దీనివల్ల ఇతర రకాల యాక్టివిటీలలో గడపడం పిల్లలకు అలవాటు అవుతుంది. ఎప్పుడూ చిన్నారులు ఆన్ లైన్ కు అతుక్కుపోకుండా ఆఫ్ లైన్ యాక్టివిటీలలో యాక్టివ్ గా పాలుపంచుకునేలా తల్లిదండ్రులు పిల్లలను అలవాటు చేయాలి. కుటుంబసభ్యులతో, స్నేహితులతో రోజులో కొంతసమయం గడపడాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల సమాజంలో నలుగురితో కలిసి మెలిసి ఉండడం పిల్లలకు అలవాటు అవుతుంది.
అంతేకాదు బంధువులు, బాంధవ్యాలు, రకరకాల మానవ సంబంధాల గురించి వారికి తెలుస్తాయి. ఎక్కువ గంటలు స్క్రీన్ పై గడిపితే వచ్చే దుష్పరిణామాలను పిల్లలకు చెపితే టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలో వారికి అర్థమవుతుంది. సో…అమ్మానాన్నలూ మీ పిల్లలు డిజిటల్ ఎడిక్షన్ పాలబడకుండా కాపాడండి….