Saturday, November 15, 2025
Homeటెక్నాలజీDRIVERLESS TRACTOR : పొలంలోకి వచ్చేసింది.. ఇకపైన డ్రైవర్ లేని ట్రాక్టర్ తో వ్యవసాయం!

DRIVERLESS TRACTOR : పొలంలోకి వచ్చేసింది.. ఇకపైన డ్రైవర్ లేని ట్రాక్టర్ తో వ్యవసాయం!

AI-powered driverless tractor technology : పొలం గట్లపై రైతు రాజసం ఉట్టిపడేలా పరుగులు తీసే ట్రాక్టర్.. ఇకపై డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లనుంది. స్టీరింగ్ తిప్పే నాథుడు లేకున్నా, దానంతట అదే దుక్కి దున్నేసి, విత్తులు నాటేసి మన ముందుకొచ్చి ఆగనుంది. వినడానికి అద్భుతంగా, ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. పంజాబ్ వ్యవాయసాయ విశ్వవిద్యాలయం (పీఏయూ) శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఈ సాంకేతికతతో వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అసలు ఈ డ్రైవర్ లేని ట్రాక్టర్ ఎలా పనిచేస్తుంది..? దీని వెనకున్న సాంకేతిక రహస్యమేంటి..? ఇది రైతన్న బతుకు చిత్రాన్ని ఎలా మార్చబోతోంది..?

- Advertisement -

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, లూధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీఏయూ) నిపుణులు ‘డ్రైవర్ రహిత ట్రాక్టర్’ను ఆవిష్కరించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి డిజిటల్, కచ్చితత్వ సాగు (Precision Agriculture) వైపు రైతులను నడిపించే ప్రయాణంలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.

జీఎన్ఎస్ఎస్ టెక్నాలజీ: ఈ డ్రైవర్ రహిత ట్రాక్టర్ వెనుక ఉన్న కీలక సాంకేతికత ‘గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ (GNSS) ఆధారిత ఆటో-స్టీరింగ్.

శాటిలైట్ సిగ్నల్స్: ఈ వ్యవస్థ బహుళ ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను గ్రహిస్తుంది.

కంప్యూటర్ గైడెన్స్: సెన్సార్లు, టచ్ స్క్రీన్ కంట్రోలర్‌తో కూడిన కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ, ఉపగ్రహ సిగ్నల్స్‌ను విశ్లేషించి ట్రాక్టర్‌కు మార్గనిర్దేశం చేస్తుంది.

కచ్చితమైన మార్గం: పొలంలో ముందుగా నిర్దేశించిన కచ్చితమైన మార్గాల్లో ట్రాక్టర్ ప్రయాణించేలా స్టీరింగ్‌ను ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది. దీనివల్ల మానవ ప్రమేయంతో జరిగే పొరపాట్లకు ఆస్కారం ఉండదు.

అన్ని పరిస్థితుల్లోనూ పనితీరు: తక్కువ కాంతి ఉన్నప్పుడు లేదా రాత్రి సమయాల్లో కూడా ఈ ట్రాక్టర్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఖర్చు తగ్గుతుంది.. సామర్థ్యం పెరుగుతుంది: పీఏయూ ప్రొఫెసర్ల బృందం ఈ ట్రాక్టర్‌కు డిస్క్ హారో, కల్టివేటర్, రోటవేటర్, స్మార్ట్ సీడర్ వంటి వివిధ వ్యవసాయ పనిముట్లను అనుసంధానించి పరీక్షించారు. “మాన్యువల్‌గా నడిపినప్పుడు 3 నుంచి 12 శాతం వరకు వ్యత్యాసం కనిపించగా, ఈ ఆటో-స్టీరింగ్ సిస్టమ్‌తో ఆ వ్యత్యాసాన్ని కేవలం ఒక శాతానికి తగ్గించగలిగాం. దీనివల్ల విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వాడకంలో వృథా తగ్గి రైతుకు పెట్టుబడి ఖర్చు గణనీయంగా ఆదా అవుతుంది” అని పీఏయూ ఇంజినీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ మంజిత్ సింగ్ తెలిపారు.

విదేశీ టెక్నాలజీ.. దేశీయ అసెంబ్లీ: ప్రస్తుతానికి ఈ కీలకమైన జీఎన్ఎస్ఎస్ టెక్నాలజీని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీని ఖరీదు సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉందని డాక్టర్ మంజిత్ సింగ్ వెల్లడించారు. “ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మొదట్లో ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. రానున్న రోజుల్లో దేశీయంగానే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ధర తగ్గుతుంది. మేము ఈ యంత్రాలను బయటి నుంచి తెప్పించినా, వాటిని పీఏయూలోనే విజయవంతంగా అమర్చాము” అని ఆయన పేర్కొన్నారు.

రైతులకు శిక్షణ.. కిసాన్ మేళాలో ప్రదర్శన: గత 4-5 ఏళ్లుగా ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపిన డాక్టర్ మంజిత్ సింగ్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ‘కిసాన్ మేళా’లో ఈ డ్రైవర్ రహిత ట్రాక్టర్‌ను ప్రదర్శనకు ఉంచుతామని ప్రకటించారు. అంతేకాకుండా, త్వరలోనే పీఏయూలో ఈ హైటెక్ ట్రాక్టర్ డ్రైవింగ్, నిర్వహణపై రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు వ్యవసాయ పనిముట్లపై రాయితీలు అందిస్తే, ఈ టెక్నాలజీ సాధారణ రైతులకు కూడా అందుబాటులోకి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒక ట్రాక్టర్ డ్రైవర్ మాట్లాడుతూ, “ఈ ట్రాక్టర్‌లో ఉన్న స్క్రీన్‌పై పొలాన్ని మనకు కావలసిన భాగాలుగా విభజించుకోవచ్చు. ఆ తర్వాత స్టీరింగ్‌ను ఆటోమేటిక్‌గా అదే ఆపరేట్ చేసుకుంటుంది. ముఖ్యంగా విత్తనాలు నాటేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది, దీనివల్ల మాకు ఖర్చులు బాగా తగ్గుతాయి” అని తన అనుభవాన్ని పంచుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad