Saturday, November 15, 2025
HomeTop StoriesEV Charging Woes: హైవేపై ఈవీ ప్రయాణం.. అడుగడుగునా ఛార్జింగ్ టెన్షన్!

EV Charging Woes: హైవేపై ఈవీ ప్రయాణం.. అడుగడుగునా ఛార్జింగ్ టెన్షన్!

Electric vehicle charging infrastructure in Telangana : కాలుష్యం లేని పర్యావరణం కోసం విద్యుత్ వాహనం (ఈవీ) కొన్నారు సరే.. కానీ సుదూర ప్రయాణానికి హైవే ఎక్కితే చాలు, గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బండి బ్యాటరీ ఎక్కడ అయిపోతుందో, తర్వాతి ఛార్జింగ్ స్టేషన్ పనిచేస్తుందో లేదోనన్న ఆందోళన ప్రయాణమంతా వెంటాడుతోంది. విశాఖ నుంచి హైదరాబాద్ రావడానికి 15 గంటలు పడుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఛార్జింగ్ కష్టాలకు కారణాలేంటి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాహనదారుల ఆవేదన ఎప్పుడు తీరుతుంది?

- Advertisement -

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నా, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కొరత వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (పీసీఎస్) కొరత, ఉన్నవాటిలో సాంకేతిక సమస్యలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సాధారణంగా ఒక విద్యుత్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల లోపే ప్రయాణిస్తుంది. అదే ఏసీ వేసుకుని, గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్తే ఛార్జింగ్ మరింత వేగంగా అయిపోతుంది. దీంతో జాతీయ రహదారులపై ప్రతి రెండు, మూడు గంటలకు ఒకసారి ఛార్జింగ్ తప్పనిసరి అవుతోంది.

అయితే, తీరా ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ మరో సమస్య స్వాగతం పలుకుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,195 స్టేషన్ల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) అనుమతి ఇవ్వగా, అందులో సగానికి పైగా, అంటే సుమారు 650 స్టేషన్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో జాతీయ రహదారులపై వెళ్లేవారికి ఛార్జింగ్ కష్టాలు తప్పడం లేదు. వాస్తవానికి, జాతీయ రహదారులపై ప్రతి 20 కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా, ఆచరణలో అది అమలుకు నోచుకోవడం లేదు.

గంటల ప్రయాణం.. యాప్‌ల భారం : హైవేలపై ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతికి, అక్కడికి చేరుకున్నాక అసలు సమస్య మొదలవుతోంది.

యాప్‌ల గందరగోళం: ప్రతి ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్‌కు ఒక్కో ప్రత్యేక యాప్ ఉంటోంది. ఛార్జింగ్ చేయాలంటే ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, డబ్బులు చెల్లించాలి. దీంతో సుదూర ప్రయాణాలు చేసేసరికి ఫోన్ మొత్తం ఛార్జింగ్ యాప్‌లతో నిండిపోతోంది.

సాంకేతిక సమస్యలు: చాలా స్టేషన్లలో సిబ్బంది ఉండరు. యాప్‌లో డబ్బులు చెల్లించినా కొన్నిసార్లు సాంకేతిక లోపాల వల్ల ఛార్జింగ్ అవ్వడం లేదు. అలాంటప్పుడు డబ్బులు వెనక్కి రాక, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు.

విశాఖ నుంచి 15 గంటలు: “విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు విద్యుత్ కారులో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరితే, ఇక్కడికి చేరేసరికి మరుసటి రోజు ఉదయం 5 అయింది. అంటే మొత్తం 15 గంటలు. అదే పెట్రోల్ కారులో అయితే 7 గంటల్లో వచ్చేయొచ్చు. దారిలో ఉన్న స్టేషన్లలో పవర్ బ్యాకప్ లేదు, ప్రతీచోటా ఓ కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చింది,” అంటూ ఓ ఈవీ యజమాని తన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ చర్యలు.. ‘పీఎం-ఈడ్రైవ్’ : ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి విద్యుత్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్’ (పీఎం ఈ-డ్రైవ్) పేరుతో రూ.10,900 కోట్ల బడ్జెట్‌తో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని కింద తెలంగాణలో కొత్తగా 3 వేల పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన రెడ్కో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసే స్టేషన్లకు 100%, ఇతర ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసేవాటికి 80% రాయితీని కేంద్రం అందించనుంది. ఛార్జింగ్ స్టేషన్లలో సమస్యలపై తమకు ఫిర్యాదు చేస్తే, సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రెడ్కో పోర్టల్‌లో ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ అనిల తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad