File sharing Between Android and iphone through Air Drop: కోట్లాది మంది ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇన్నాళ్లుగా ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఎయిర్ డ్రాప్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఐఫోన్‌కు సులభంగా ఫైళ్లను పంపుకునే అవకాశం కలుగుతుంది. అయితే, గతంలో ఐఫోన్ నుంచి మరో ఐఫోన్‌కు మాత్రమే ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు సైతం ఫైళ్లు పంపుకునే అవకాశం రానుంది. దీంతో, ఆండ్రాయిడ్ యూజర్లు ఎగిరి గంతేస్తున్నారు.
ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు ఫైళ్లను పంపుకునే విధానం..
ఒకవేళ, మీ వద్ద ఉన్న గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్ నుంచి ఐఫోన్‌కు ఫైల్ పంపాలనుకుంటే, ముందుగా ఐఫోన్‌లో ఎయిర్‌డ్రాప్ సెట్టింగ్‌ను ఎవర్రీ వన్ కింద మార్చాలి. అనంతరం, ఐఫోన్ పేరు పిక్సెల్ 10లోని క్విక్ షేర్‌లో కనిపిస్తుంది. తర్వాత, మీరు డివైస్‌ను సెలెక్ట్ చేసి ఫైల్ పంపిస్తే, అది ఎయిర్‌డ్రాప్ మాదిరిగానే వెంటనే షేర్ అవుతుంది. ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్‌కు ఫైళ్లు పంపాలంటే.. పిక్సెల్ 10ను కూడా ఓపెన్/ డిస్కవరబుల్ చేయాలి. ఇప్పుడు ఐఫోన్ యూజర్ ఎయిర్‌డ్రాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌కి ఫైళ్లను పంపవచ్చు. అంటే రెండు ప్లాట్‌ఫార్మ్‌ల మధ్య ఫైళ్లు షేర్ చేసుకోవడం సులభమవుతుంది.
ఎయిర్‌డ్రాప్ ఎలా పనిచేస్తుంది?
చాలా మంది ఇది యాపిల్-గూగుల్ కలిసి చేసిన ప్రాజెక్ట్ అనుకుంటున్నారు . కానీ ఇది పూర్తిగా మా సొంత టెక్నాలజీతోనే చేశామని గూగుల్ స్పష్టం చేస్తోంది. గూగుల్ ప్రతినిధి అలెక్స్ మోరికోని మాట్లాడుతూ.. “ఇది పూర్తిగా మా స్వంత పని. ఆపిల్ నుంచి ఎలాంటి సహాయం తీసుకోలేదు”. అని తెలిపారు. అయితే, భవిష్యత్‌లో ఆపిల్‌తో కలిసి పనిచేయడానికి గూగుల్ సిద్ధంగా ఉందని గూగుల్ స్పష్టం చేసింది.
ఆండ్రాయిడ్-ఐఫోన్ ఎయిర్‌డ్రాప్ భద్రమేనా?
గూగుల్ ప్రకారం, ఆండ్రాయిడ్ ఐఫోన్ ఎయిర్‌డ్రాప్ అత్యంత సురక్షితమైనది. మీ డేటా ఎక్కడా చోరీకి గురవ్వదు. డేటా ఇతర సర్వర్లకు వెళ్లదు. అంతేకాదు, డేటా లాగ్ చేయబడదని గూగుల్ స్పష్టం చేసింది. పీర్-టు-పీర్ కనెక్షన్ ద్వారా నేరుగా రెండు డివైస్‌ల మధ్యే డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుందని తెలిపింది. సెక్యూరిటీ నిపుణులు కూడా ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారని గూగుల్ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎయిర్‌డ్రాప్ ఫీచర్ అందుబాటులోకి రావడం నిజంగా పెద్ద మార్పుగా చెప్పవచ్చు. దీనిపై ఆపిల్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ సపోర్టు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ, ఈ ఫీచర్ గనుక అందుబాటులోకి వస్తే.. ఆండ్రాయిడ్ ఐఫోన్ మధ్య ఫైల్ షేరింగ్ సమస్యకు చెక్ పడినట్టే.

