బంగారం, వెండికి బులియన్ మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రెండు లోహాల ధరలు.. నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి భారీగా ధరలు తగ్గితే.. మరోసారి పెరుగుతుంటాయి. తాజాగా బంగారం ధర తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. సోమవారం తులం బంగారం ధర రూ.700 తగ్గి రూ.79,000లకు పడిపోయింది.
గత శుక్రవారం పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.79,700 వద్ద స్థిర పడింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.300 వృద్ధితో రూ.90,700లకు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.90,400 వద్ద ముగిసింది. సోమవారం 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.700 తగ్గి రూ.78,600 పలికింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.79,300 వద్ద స్థిర పడింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.247క్షీణించి, రూ.77,070 పలికింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.479 పతనమై రూ.89,700 వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, కన్జూమర్ డిమాండ్లకు అనుగుణంగా వెండి, వెండి ఆభరణాల విక్రయంపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసే విషయమై సంబంధిత వాటాదారులతో సంప్రదించి చర్య తీసుకోవాలని బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియా ని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు.
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం 0.18 శాతం పుంజుకుని 2,659.60 డాలర్లు పలికింది. ఔన్స్ బంగారం 30.87డాలర్లకు చేరుకుంది. హాలీడే సీజన్ నేపథ్యంలో గత 20 ఏండ్ల తర్వాత జనవరిలో బంగారం ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని జ్యువెల్లరీ ఆభరణాల వ్యాపారులు చెప్పారు.