Google Chrome security threat : మీరు రోజూ ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఆన్‌లైన్ బ్యాంకింగ్ నుండి సోషల్ మీడియా వరకు ప్రతిదానికీ దానిపైనే ఆధారపడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం మొత్తం ప్రమాదంలో పడినట్లే! భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) కోట్లాది మంది క్రోమ్ వినియోగదారులకు ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ఇంతకీ ఆ ప్రమాదం ఏంటి? హ్యాకర్లు మిమ్మల్ని ఎలా లక్ష్యంగా చేసుకుంటారు? దాని నుండి బయటపడే ఏకైక మార్గం ఏమిటి? ఈ కీలక విషయాలను తెలుసుకోకుండా ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్ కూడా చేయకండి.
అసలు ప్రమాదం ఏమిటి? CERT-In ఏం చెబుతోంది : భారతదేశంలో సైబర్ భద్రతకు సంబంధించి అత్యున్నత సంస్థ అయిన CERT-In, గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను (vulnerabilities) గుర్తించింది. ఈ లోపాలు హ్యాకర్లకు ఒక వరంలా మారాయని, వీటిని అదునుగా చేసుకుని వారు వినియోగదారుల డేటాను సులభంగా దొంగిలించగలరని హెచ్చరించింది.
ఈ లోపాల వల్ల హ్యాకర్లు ప్రధానంగా రెండు రకాల దాడులకు పాల్పడవచ్చు..
స్పూఫింగ్ ఎటాక్ (Spoofing Attack): అంటే, హ్యాకర్లు నమ్మకమైన వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఉదాహరణకు, మీ బ్యాంకు వెబ్‌సైట్‌లా కనిపించే ఒక నకిలీ పేజీని మీకు పంపి, మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను తస్కరించగలరు.
సున్నితమైన సమాచారం బహిర్గతం: మీ పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు, వ్యక్తిగత ఫైల్స్ వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు దోచుకునేందుకు ఈ లోపాలు ఆస్కారం కల్పిస్తాయి.
హ్యాకర్లు మిమ్మల్ని ఎలా లక్ష్యంగా చేసుకుంటారు : హ్యాకర్లు ఎక్కడో సుదూర ప్రాంతం నుంచే మీ సిస్టమ్‌పై దాడి చేయగలరు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా ఒక హానికరమైన వెబ్‌పేజీని (specially crafted web page) రూపొందిస్తారు. మీకు వాట్సాప్, ఈమెయిల్, లేదా సోషల్ మీడియా ద్వారా ఒక ఆసక్తికరమైన లింక్‌ను పంపి, దాన్ని క్లిక్ చేయమని ప్రేరేపిస్తారు. మీరు ఆ లింక్‌ను నమ్మి క్లిక్ చేసిన వెంటనే, మీ బ్రౌజర్‌లోని భద్రతా లోపాలను అదునుగా చేసుకుని హ్యాకర్లు మీ సిస్టమ్‌లోకి చొరబడతారు. ఆ తర్వాత జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది.
రక్షణకు తక్షణ కర్తవ్యం ఇదే : ఇంత పెద్ద ప్రమాదం నుండి బయటపడటానికి ఉన్న ఏకైక, సులభమైన మార్గం మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తక్షణమే అప్‌డేట్ చేసుకోవడం. గూగుల్ ఇప్పటికే ఈ భద్రతా లోపాలను సరిచేస్తూ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వినియోగదారులందరూ తప్పనిసరిగా తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని CERT-In గట్టిగా సూచించింది.
క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకోండిలా: మీ కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను తెరవండి. కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల (…) మెనూపై క్లిక్ చేయండి. “సహాయం” (Help) పైకి కర్సర్ తీసుకువెళ్లి, “Google Chrome గురించి” (About Google Chrome) పై క్లిక్ చేయండి. అక్కడ క్రోమ్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ కోసం చెక్ చేస్తుంది. అప్‌డేట్ అందుబాటులో ఉంటే, అది డౌన్‌లోడ్ అయ్యి, రీలాంచ్ (Relaunch) బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ అప్‌డేట్ అవుతుంది.


