Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSIM box Fraud : అంతర్జాతీయ కాల్.. స్థానిక నంబర్! 'సిమ్‌బాక్స్' మాయాజాలం.. హైదరాబాద్‌లో ముఠా...

SIM box Fraud : అంతర్జాతీయ కాల్.. స్థానిక నంబర్! ‘సిమ్‌బాక్స్’ మాయాజాలం.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్!

SIM box fraud Hyderabad : మీకు విదేశీ నంబర్ నుంచి కాకుండా, ఓ స్థానిక నంబర్ నుంచి ఫోన్ చేసి, మీ బ్యాంకు వివరాలు అడిగారా? లాటరీ తగిలిందని నమ్మించారా? అయితే ఆ కాల్ వెనుక ఓ భారీ సాంకేతిక మోసం దాగి ఉండే అవకాశం ఉంది. అదే ‘సిమ్‌బాక్స్’ ఫ్రాడ్. విదేశాల నుంచి వచ్చే మోసపూరిత ఇంటర్నెట్ కాల్స్‌ను, మన స్థానిక మొబైల్ నంబర్లుగా మార్చే ఈ అత్యాధునిక మోసానికి పాల్పడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. అసలు ఏమిటీ సిమ్‌బాక్స్ టెక్నాలజీ..? ఈ ముఠా ఎలా పనిచేసింది..?

- Advertisement -

చక్షు’ ఫిర్యాదు.. చిక్కిన ముఠా : మోసపూరిత ఫోన్ కాల్స్‌పై ఫిర్యాదుల కోసం కేంద్ర టెలికాం శాఖ ఇటీవల ‘చక్షు’ (Chakshu) అనే ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌కు వచ్చిన ఓ ఫిర్యాదే ఈ ముఠా గుట్టును రట్టు చేసింది.

ఓ బాధితుడు, తనకు గుర్తుతెలియని స్థానిక నంబర్ నుంచి కాల్ వచ్చిందని, తనను మోసం చేశారని ‘చక్షు’ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని టెలికాం అధికారులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు పంపడంతో, దర్యాప్తు మొదలైంది. టెలికాం శాఖ (DoT) సహకారంతో, ఆ కాల్స్ హైదరాబాద్‌లోని పాతబస్తీ చాంద్రాయణగుట్ట ప్రాంతం నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దాడి.. బయటపడ్డ వాస్తవాలు : గుర్తించిన చిరునామాపై దాడి చేసిన బ్యూరో అధికారులు, అక్కడ ఓ సిమ్‌బాక్స్‌తో పాటు, సుమారు 200 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసానికి పాల్పడుతున్న హిదయుల్లా, ఆహద్ ఖాన్, షేక్ షోయబ్‌లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నష్టపోయి.. నేరంలోకి : ఈ కేసులో ప్రధాన నిందితుడైన హిదయుల్లా, కార్ల వ్యాపారంలో నష్టపోయి, ఆ డబ్బును తిరిగి సంపాదించేందుకు అడ్డదారులు తొక్కాడు.

ఆన్‌లైన్ మోసం: ఓ వ్యక్తి సలహా మేరకు ఆన్‌లైన్ గ్రూప్‌లో చేరి, అక్కడ కూడా రూ.16 లక్షలు పోగొట్టుకున్నాడు.

హాంకాంగ్ మహిళతో పరిచయం: అదే వ్యక్తి, హిదయుల్లాకు వాట్సాప్ ద్వారా హాంకాంగ్‌కు చెందిన వెనీసా అనే మహిళను పరిచయం చేశాడు.

సిమ్‌బాక్స్ ఆఫర్: సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపార ప్రచారం కోసం సిమ్‌బాక్స్ ఏర్పాటు చేస్తే, భారీగా లాభాలు వస్తాయని ఆమె ఆశ చూపింది.

సిమ్‌బాక్స్ ఎలా పనిచేస్తుంది : ఈ ఏడాది ఫిబ్రవరిలో వెనీసా, కొరియర్ ద్వారా హిదయుల్లాకు సిమ్‌బాక్స్‌ను పంపింది. ఇది అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తుంది.
అంతర్జాతీయంగా వచ్చే ‘వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్’ (VoIP) కాల్స్‌ను ఈ సిమ్‌బాక్స్ స్వీకరిస్తుంది.

ఆ తర్వాత, దానిలో అమర్చిన వందలాది స్థానిక సిమ్‌కార్డుల ద్వారా, ఆ ఇంటర్నెట్ కాల్స్‌ను సాధారణ వాయిస్ కాల్స్‌గా (లోకల్ కాల్స్‌గా) మారుస్తుంది. దీనివల్ల, బాధితులకు విదేశీ నంబర్ బదులుగా, మన స్థానిక మొబైల్ నంబర్ కనిపిస్తుంది. దీంతో వారు సులభంగా మోసపోతారు. ఈ మోసం కోసం, నిందితులు కొల్లూరు ప్రాంతంలోని వలస నిర్మాణ కార్మికులకు సిమ్‌కార్డులు అమ్మి, వారి ధ్రువపత్రాలతో సుమారు 500 సిమ్‌కార్డులను అక్రమంగా సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సంబంధం ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad