Iphone features:ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఆసక్తి రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి పైగా ఉన్న ఆపిల్ అభిమానుల దృష్టి ఈ ఏడాది సెప్టెంబరు నెల పైనే ఉంది. తాజా లీక్ ల ప్రకారం, ఆపిల్ ఈసారి నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టనుంది: ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, మరియు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. ఈ సిరీస్‌లో తొలిసారిగా “ఎయిర్” మోడల్ పరిచయం కావడం అనేక చర్చలకు దారితీస్తోంది. ఆపిల్ ఇప్పటి వరకు 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే టెక్నాలజీని కేవలం ప్రో మోడళ్లకే పరిమితం చేసింది. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్‌లో ఈ ఫీచర్ అన్ని మోడళ్లలోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల స్క్రోల్లింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉండటం తో పాటు, వీడియోలు గమనించదగిన మెరుగుదలతో ప్రదర్శించబడతాయి. ప్రో-గ్రేడ్ అనుభూతిని స్టాండర్డ్ మోడళ్లకూ ఇవ్వడం వినియోగదారులకు తీపి కబురు.
కెమెరా విభాగంలో విప్లవం
- ఫ్రంట్ కెమెరా: ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్లలో 24MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశముంది. ఇది గత ఐఫోన్ 16 సిరీస్‌లోని 12MP కెమెరాతో పోలిస్తే రెండింతల స్పష్టతను అందించనుంది.
- ప్రో మ్యాక్స్ కెమెరా: ట్రిపుల్ 48MP సెన్సార్ సెటప్‌తో (వైడ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో) వస్తున్న మొట్టమొదటి ఐఫోన్ కావొచ్చని టెక్ బ్లాగర్లు చెబుతున్నారు. అదనంగా, 8K వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీకి ఇది గొప్ప అప్గ్రేడ్ అవుతుంది.
డిజైన్‌లో కొత్తదనం
డిజైన్ పరంగా ఆపిల్ ఈసారి పెద్ద మార్పును చేపట్టినట్లు ఊహాగానాలు సూచిస్తున్నాయి. అల్యూమినియం ఫ్రేమ్ను అన్ని మోడళ్లలో కూడా అమలుచేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రో మోడళ్లకు స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా టైటానియం ఫ్రేమ్ ఉపయోగించగా, ఇప్పుడు వాటికీ అల్యూమినియం ఫ్రేమ్ ఇవ్వడం అనేక అర్థాలు ఇస్తోంది.. ఇది మొబైల్ బరువు తగ్గించడం, డిజైన్ సౌలభ్యం, తయారీ ఖర్చుల తగ్గింపు వంటివి చేసేందుకే అని తెలుస్తోంది. ఇది వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నిపుణుల అభిప్రాయం.
ధరల పై అంచనాలు
కొత్త ఫీచర్ల జోడింపుతో పాటు, ముడి సరుకుల ఖర్చులు పెరగడం వల్ల ఈసారి ఐఫోన్ 17 సిరీస్ ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజా లీకుల ప్రకారం, ధరల అంచనాలు ఇలా ఉన్నాయి:
- ఐఫోన్ 17 – $799 (సుమారు రూ.67,000)
- ఐఫోన్ 17 ఎయిర్ – $899 (సుమారు రూ.75,000)
- ఐఫోన్ 17 ప్రో – $999 (సుమారు రూ.83,500)
- ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – $1,199 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం
ఇంకా ధరలు అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఈ అంచనాలు మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
విడుదల తేదీ ఎప్పుడు?
ఐఫోన్ 17 సిరీస్ ను ఆపిల్ కంపెనీ 2025 సెప్టెంబర్ 9న లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సిరీస్ లాంచ్ సమయంలోనే కొత్త ఆపిల్ వాచ్ లు, iOS 19, ఇతర గాడ్జెట్లు కూడా ప్రకటించవచ్చు. ఈసారి ఆపిల్ తీసుకురానున్న ఐఫోన్ 17 సిరీస్ చాలా కీలకమైనదిగా మారనుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన డిస్‌ప్లే, అత్యుత్తమ కెమెరా ఫీచర్లు, మెరుగైన డిజైన్, అన్నింటికంటే ముఖ్యంగా వినియోగదారులకు అవసరమైన అనుభవాలను అందించే దిశగా ఆపిల్ సాగిపోతోంది. ధరలు కొద్దిగా పెరగొచ్చునా అన్న సందేహం ఉన్నా, ఆపిల్ నాణ్యత కోసం వినియోగదారులు దీనిని అంగీకరించగలరని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.