Bluebird: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న కీలక వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్’ వాయిదా పడింది. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం ఈ నెల 17 నుంచి 21వ తేదీకి మారినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఎల్వీఎం3-ఎం6 (LVM3-M6) రాకెట్ ద్వారా ఈ బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.
వాయిదాకు కారణం: నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉపగ్రహాన్ని ఈనెల 17న ప్రయోగించాలని తొలుత ఇస్రో భావించింది. అయితే షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో జరుగుతున్న రాకెట్ అనుసంధాన పనులలో ఆలస్యం ఏర్పడటంతో ప్రయోగాన్ని ఈ నెల 21కి వాయిదా వేసినట్లు సమాచారం. అన్ని సన్నాహాలు సజావుగా సాగితే, ఈ నెల 21న షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ బ్లూబర్డ్‌ను తీసుకుని అంతరిక్షంలోకి పయనమవుతుందని వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ప్రయోగా తేదీపై ఇస్రో అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు రాకెట్‌లో ఉపయోగించే ఇంధనం (లిక్విడ్)ను తమిళనాడులోని మహేంద్రగిరి నుంచి ప్రత్యేక వాహనంలో గురువారం షార్‌కు తీసుకువచ్చారు.
మెగా ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం: ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ‘బ్లూబర్డ్-6’ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగానికి ఎల్వీఎం-03 ఎం6 (LVM-03 M6) అనే అప్‌గ్రేడెడ్ రాకెట్‌ను ఉపయోగించనున్నారు. గతంలో కేవలం 2 టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగే సామర్థ్యం ఇస్రోకు ఉండేది. భారీ ఉపగ్రహాల కోసం రష్యా, ఫ్రెంచ్ గయానా వంటి దేశాల సహకారం తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఈ పరిస్థితిని అధిగమించిన ఇస్రో.. 4 టన్నుల సామర్థ్యం ఉన్న ఎల్వీఎమ్-3 (LVM-3) వాహక నౌకను (బాహుబలి రాకెట్) విజయవంతం చేసింది. ఇప్పుడు ఇస్రో ఈ రాకెట్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి 6.5 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని సైతం సులభంగా మోసుకెళ్లే సామర్థ్యాన్ని సాధించింది. ఈ అప్‌గ్రేడెడ్ రాకెట్‌ను అంతరిక్ష నిపుణులు ‘బాహుబలి 2’ స్థాయి రాకెట్‌గా అభివర్ణిస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/technology-news/nissan-new-mpv-set-to-be-launched-in-india-on-18-december/
భారత్-అమెరికా సంయుక్త ప్రయోగం: ఈ మెగా ప్రయోగం భారత్-అమెరికా సంయుక్తంగా చేపడుతున్నాయి. అత్యంత భారీ బరువున్న అమెరికాకు చెందిన బ్లూబర్డ్-6 ఉపగ్రహాన్ని ఎల్వీఎం-03 ఎం6 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ఇస్రో వాణిజ్య అంతరిక్ష ప్రయాణంలో కీలక ఘట్టం కానుంది.

