Saturday, November 15, 2025
Homeటెక్నాలజీBitchat: 'బిట్‌చాట్'తో ఇంటర్నెట్ లేకున్నా మెసేజ్ పంపొచ్చు

Bitchat: ‘బిట్‌చాట్’తో ఇంటర్నెట్ లేకున్నా మెసేజ్ పంపొచ్చు

Offline Messaging App Bitchat: ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, బ్లాక్ సీఈఓ జాక్ డోర్సే మరో కొత్త టెక్నాలజీతో సంచలనం సృష్టిస్తున్నారు. అతను తాజాగా ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్ లేకుండా పనిచేసే సరికొత్త మెసేజింగ్ యాప్ “బిట్‌చాట్”ను విడుదల చేశాడు. ఇది ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఒక కొత్త సాంకేతికతకు నాంది పలకనుంది. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ అప్లికేషన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో లేదా నెట్‌వర్క్ సమస్యలు ఉన్న సమయాల్లో కూడా కమ్యూనికేషన్ అందించాలనే లక్ష్యంతో రూపొందించారు.

- Advertisement -

సాధారణ మెసేజింగ్ యాప్‌లైన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ మాదిరిగా కాకుండా, బిట్‌చాట్ సెంట్రలైజ్డ్ సర్వర్‌లపై ఆధారపడదు. బదులుగా ఇది బ్లూటూత్ లో ఎనర్జీ (BLE) మెష్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి పనిచేస్తుంది. దీని అర్థం ఏమిటంటే, ఒక బిట్‌చాట్ వినియోగదారుడు మరొక బిట్‌చాట్ వినియోగదారుడికి దగ్గరగా ఉన్నప్పుడు (సుమారు 300 మీటర్ల పరిధిలో), వారి ఫోన్లు బ్లూటూత్ ద్వారా నేరుగా కనెక్ట్ అవుతాయి. ఈ పరికరాలు ఒక వారదిలా పనిచేసి, సందేశాలను ఒకరి నుండి మరొకరికి పంపుతాయి. దీని వల్ల నెట్‌వర్క్ పరిధికి మించిన దూరంలో ఉన్నప్పటికీ సందేశాలు చేరవేయబడతాయి.

బిట్ చాట్ లక్షణాలు, ప్రాముఖ్యత

  • ఇంటర్నెట్ అవసరం లేదు. ఇది బిట్‌చాట్ అతిపెద్ద ప్రత్యేకత, వైఫై, మొబైల్ డేటా లేదా సిమ్ కార్డ్ అవసరం లేకుండానే సందేశాలు పంపవచ్చు.
  • ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. పంపిన సందేశాలు పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి, వినియోగదారుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది.
  • డేటా గోప్యత ఉంటుంది. బిట్‌చాట్‌లో ఎటువంటి సెంట్రల్ సర్వర్ ఉండదు. సందేశాలు కేవలం వినియోగదారుల పరికరాలలో మాత్రమే నిల్వ చేయబడతాయి. స్వయంచాలకంగా కొంత సమయం తర్వాత తొలగించబడతాయి. యూజర్ ఐడి, ఫోన్ నంబర్, ఇమెయిల్ వంటివి అవసరం లేకుండానే చాట్ చేయవచ్చు.
  • అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా నెట్‌వర్క్ బ్లాక్‌అవుట్‌ల వంటి అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్ కొనసాగించడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది.
  • గ్రూప్ చాట్‌లు, పాస్‌వర్డ్ రక్షణ ఉంటుంది. యాప్‌లో గ్రూప్ చాట్‌లు (రూమ్స్) ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వీటిని పాస్‌వర్డ్‌లతో కూడా రక్షించుకోవచ్చు.
  • స్టోర్ అండ్ ఫార్వార్డ్ మెకానిజం ఉంది. ఒక వినియోగదారుడు తాత్కాలికంగా ఆఫ్‌లైన్‌లో ఉంటే, సందేశాలు ఆఫ్‌లైన్ అయిన వారి పరికరంలో నిల్వ చేయబడతాయి. వారు మళ్లీ ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు బట్వాడా చేయబడతాయి.

బిట్‌చాట్ అనేది కేవలం ఒక ప్రయోగం అని డోర్సే పేర్కొన్నప్పటికీ, ప్రైవసీ, నెట్‌వర్క్ స్వాతంత్య్రాన్ని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప పరిష్కారంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో దీనిని మరింత అభివృద్ధి చేయనున్నారు. వైఫై సహాయంతో బ్యాండ్‌విడ్త్‌ను పెంచి, చిత్రాలు, వీడియోలను పంపే విధానం కూడా తీసుకురావాలని డోర్సే బృందం యోచిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad