తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ భహిరంగ లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు టెక్నోక్రాట్స్‌కు ఆహ్వానం పలుకుతూ జయేశ్ రంజన్ ఈ లేఖ రాయటం విశేషం. సింగపూర్‌లో ఆగస్టు 5, 6 తేదీల్లో జరగనున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలకు పెద్ద ఎత్తున్న హాజరు కావాలని పిలుపునిచ్చారు. దాదాపు 100కు పైగా దేశాల నుంచి హాజరుకానున్న ఈ తెలుగు ఐటీ మహాసభలకు ప్రతినిధులు పెద్దఎత్తున హాజరుకావాలన్నారు.
సింగపూర్‌లో వచ్చే ఆగస్టు 5, 6 తేదీల్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్స్ పెద్ద ఎత్తున్న హాజరు కావాలని తెలంగాణ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు. దాదాపు 100కు పైగా దేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు, నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్ హాజరుకానున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభల ద్వారా ఇటు పరిశ్రమ అభివృద్ధి అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు పొందగలరని వివరించారు. మహాసభల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్స్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మరియు స్వదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఐటీ రంగ నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు వరల్డ్ తెలంగాణ ఐటీ కౌన్సిల్ (WTITC) సందీప్ కుమార్ మఖ్తల నాయకత్వంలో ఏర్పడింది. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఆయన అమెరికా, కెనడా, మెక్సికో, మలేసియా, సింగపూర్, ఒమన్,యూఏఈ దేశాలలో పర్యటించి ఆయా వర్గాలతో సమావేశమయ్యారు. దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమ యొక్క తెలుగు ప్రముఖులను సమావేశపర్చేందుకు వచ్చే ఆగస్టు 5,6 తేదీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహాయ సహకారాలతో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొనడం యొక్క ఆవశ్యకత, కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ, తెలంగాణ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బహిరంగ లేఖ రాశారు.
సింగపూర్ వేదికగా ఆగస్టు 5,6 తేదీలలో జరిగే ఈ మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్ విచ్చేస్తున్న ఈ మహసభలలో తాను సైతం పాలుపంచుకోబోవడం సంతోషంగా ఉందని జయేశ్ రంజన్ తెలిపారు. ఇంతటి ముఖ్యమైన సమావేశం ద్వారా ప్రపంచలోనే అత్యధికులుగా వున్న తెలుగు టెక్నోక్రాట్స్ ను కలుసుకోవడం తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నట్లు వివరించారు. “WTITC 2023 ద్వారా తెలుగు ఐటీ పరిశ్రమ నిపుణులు సమావేశం అవడం, వివిధ అంశాలపై అభిప్రాయాల వ్యక్తీకరణ, మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవడం ఈ మహాసభ ద్వారా జరిగే కీలకమైన అంశాలు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం అవడం ఈ మహాసభలకు చెందిన మరో ముఖ్యమైన అవకాశం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమైన విధానాలు, నిర్ణయాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. టెక్నికల్ ప్రజెంటేషన్, థాట్ ప్రొవొకింగ్ డిస్కషన్స్‌డిస్కషన్ సెషన్స్ వంటివి ఈ మహాసభల్లో భాగం చేయడం వల్ల పాల్గొనే కేవలం ప్రొఫెషనల్ నెట్‌వర్క్ విస్తరించుకోవడమే కాకుండా వారి సాంకేతిక పరిజ్ఞానం సైతం పెంపొందించుకునే అవకాశం దక్కుతుంది.
ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకొని పాల్గొనడం ద్వారా వ్యక్తిగతంగా , సంస్థాగతంగా అభివృద్ధి చెందడమే కాకుండా తెలుగు ఐటీ పరిశ్రమ సత్తాను చాటేందుకు సైతం అవకాశం అందించినవారు అవుతాం` అని ఆయన వెల్లడించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు bit.ly/wtitc23 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం చైర్మన్ సందీప్ మఖ్తలను 8123457575/8123123434 నంబర్లలో సంప్రదించవచ్చని కోరారు.